ఆహారానికి, ఆరోగ్యానికి వాగ్దానం

ఇప్పుడు అసలే రోగంలేని మనిషి మన చుట్టూ ఉన్నాడం టే అది చాలా ఆశ్చర్యకరమైన విషయం. కారణం మనం తినే ఆహారం,అనుసరిస్తున్న జీవనశైలి. అసలు మనమేం తింటున్నాం,ఏం కొంటున్నాం అనేది ఆలోచించే తీరిక కూడా ఎవరికి లేదు. ప్రతిఒక్కరూ ఏదో ఒక ఆరోగ్య సమస్యతో సతమతమవుతున్నా, పూటకు గుప్పెడు మందులు వేసుకుంటున్నా,ప్రత్యామ్నాయాల వైపు అంత తొందరగా ఆలోచించడం లేదు. kakaraa మనం తినే క్యాబేజి మన ప్లేట్లోకి వచ్చేసరికి 20 సార్లు రసాయన పురుగుమందులు చల్లుతారు. వంకాయపై 20 నుంచి 30 సార్లు, టమాటా, బెండపై 8నుంచి 20 సార్లు, క్యారెట్‌పై 2 నుంచి 4సార్లు, బీన్స్, బీరలపై 4నుంచి 8సార్లు, దోస, ఆకుకూరల్లో 2నుంచి 6సార్లు,మిరపపై 15నుంచి 20సార్లు విషపూరితమైన పురుగు మందులు పిచికారీ చేస్తున్నారు. ఇంతటి ప్రమాదకరమైన ఆహారా న్ని, మనం తీసుకోవడంతో పాటు మన పిల్లలకూ తినిపిస్తున్నాం. ఈ రసాయన ఎరువులు, పురుగు మందులతో పండించిన కూరగాయలు,పండ్లు, ఆహారధాన్యాలు తీసుకోవడం వల్ల కాన్సర్, బి.పి, డయాబెటిస్, కీళ్లనొప్పులు, స్థూలకాయం, గుండె జబ్బులు, ముఖ్యంగా చిన్నపిల్లలు ఆడవాళ్లలో రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నా యి. దీని ప్రభావంతో చిన్నాపెద్దా తేడా లేకుండా పల్లె పట్టణం అంతరంలేకుండా అంతులేని రోగాలు మానవ జాతిని కబలిస్తున్నాయి. పల్లెల్లో ఇంకా పెరటి తోటలు కనిపిస్తున్నాయి. కానీ పట్టణాల్లో మాత్రం రసాయన ఎరువు ల, పురుగు మందుల కూరగాయలు, పండ్లే ప్రజలకు దిక్కయ్యాయి. ఈ విష రసాయన అవశేషాలు జీన్స్‌లో నిక్షిప్తమై, భావితరాల జీవితం ప్రమాదంలో పడిపోతున్నదన్న విషయం మనం పరిగణనలోకి తీసుకోవడం లేదు.

మరోవైపు పరిశ్రమలు,నివాసిత ప్రాంతాల నుంచి వెలువడే వ్యర్థ,కలుషిత జలాలతో పంటలను సాగుచేయడం కూడా పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నది. మనం కొనే కూరగాయలను ఎంత ఉడికించి తిన్నా, వాటిలో ప్రమాదకరమైన బెంజీన్, సీసం, పాదరసం వంటి విషపదార్థాలు అలాగే ఉంటున్నాయి. ఈ ప్రమాదం కేవలం కూరగాయలకే పరిమితం కాలేదు. మనం పండించే పండ్లు పండించే ప్రతి ధాన్యం కూడా ఈ విష రసాయన ఎరువులు, పురుగు మందుల బారిన పడుతున్నాయి. రసాయనిక పురుగు మందుల అవశేషాలతో ఆహారం కలుషితమై ఆరోగ్యాన్ని హరిస్తున్న నేపథ్యంలో ఈ విషయాలపై అవగాహన కలిగినవాళ్లు పురుగు మందులు, ఎరువుల అవసరంలేని సహజ ఆహారోత్పత్తులవైపు నెమ్మదిగా మళ్లుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సహజ ఆహా ర ఉత్పత్తుల వినియోగంపై క్రమక్రమంగా చైతన్యం పెరుగుతున్నది. తమకున్న కొద్దిస్థలంలో తామే స్వయం గా పండించుకోవాలన్న భావన అంకురిస్తున్నది. నిజానికి ఇంటిపంట అనేది రాకెట్‌సైన్స్ కాదు. ఇంటి వెనుక, పక్కన లేదా పైభాగంలో ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ నాలుగు కుండీలో,చిన్న చిన్న మడులో ఏర్పాటు చేసుకుని చాలా సులువుగా ఆకుకూరలు, కూరగాయలు పండించుకోవచ్చు. ముఖ్యంగా పట్టణాల్లో ఉన్నవాళ్లకు డాబాల మీద పండించుకునే అవకాశం ఎక్కువగా ఉన్నది. పల్లె మూలాలు ఉన్నవాళ్లకు పట్టణంలో కూరగాయలు పండించుకోవడంలో పెద్ద ఇబ్బందేమీ ఉండ దు. తమ చేతి వంట తమ ఇంటి మీద పండించుకోవాలన్న ఆలోచనే ఇక్కడ ప్రధానం.

ఒక్క గ్రేటర్ హైదరాబాద్‌లోనే సుమారు 22 లక్షల ఇళ్లు, అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. వీటి పైకప్పులు, బాల్కనీలు, పెరట్లో సుమారు 15వేల ఎకరాల సాగు స్థలం ఉన్నట్లు ఒక అంచనా. ఇపుడు సాగవుతున్న స్థలాన్ని లెక్కిస్తే అది కనీసం 100 ఎకరాలు లేకపోవడం గమనార్హం. చిన్నచిన్న పట్టణాల్లో కూడా దీనిపై ఇప్పుడిపుడే అవగాహన పెరుగుతున్నది. నిజంగా,రూఫ్‌గార్డెన్స్ విషయంలో మనకంటే పాశ్చాత్య దేశాలు ముందున్నాయి. జర్మనీ దేశంలో దాదాపు పధ్నాలుగు శాతం మిద్దెలు గ్రీన్ టాప్ చేయబడి నాయి. అక్కడ ఏటా ఈ రంగంలో పది శాతం పైగా అభివృద్ధి సాధిస్తున్నది. కెనడా,ఫ్రాన్స్,స్విట్జర్లాండ్ దేశాలు రూఫ్ గార్డెన్స్‌పై చట్టాలు కూడా చేశాయి. మన దగ్గర ఒక ఉద్యమస్థాయిలో రూఫ్‌గార్డెన్స్ పెంచాల్సిన అవసరం ఉన్నది. కేవలం ఒక చిన్న తోటను పెంచుకోగలిగితే మనం అనేకరకాల సమస్యలను పరిష్కరించుకోవచ్చు.

-మనకున్న కొద్ది స్థలంలోనే మనకు కావలసిన కూరగాయలు,పండ్లు పండించుకోవడం. -పిల్లలకు ఆర్యోకరమైన, రుచికరమైన పోషక విలువలు కలిగిన మంచి ఆహారం అందించడం. -శారీరక వ్యాయామం, మానసిక ఆనందం. -పిల్లలకు ప్రకృతితో అనుబంధం. -కూరగాయలు, పండ్లు కొనాల్సిన అవసరం లేకపోవ డం. -రూఫ్ మీద చిన్న గార్డెన్ ఉంటే,ఎండాకాలంలో కావలసినంత చల్లదనాన్ని అందిస్తుంది.

మనకు ప్రకృతి సహజంగా అందిన జీవితం ప్రకృతిగా దగ్గరగా, పూర్తి ప్రకృతి సహజంగా ఉండాలే తప్ప, కృత్రి మ జీవన విధానం వల్ల అది తన సహజత్వాన్ని కోల్పోకూడదు. యాంత్రిక జీవితంలో మనం కూడా ఇంట్లో ఉన్న ఒక వస్తువులా మిగిలిపోకూడదు. మన చేత్తో విత్తిన విత్తనం మన కళ్లముందే ఒక్క మొక్కగా ఎదిగి,పండ్లు ఫలాలతో కళకళలాడుతున్నపుడు మనలోపలి పత్రహరి తం తిరిగి మనల్ని ప్రాకృతిక మానవుడిగా నిలుపుతుంది. ఇందుకు మనం చేయాల్సింది, మట్టిలో ఒక్క విత్తనం వేసి ప్రకృతితో తిరిగి మన అనుబంధాన్ని పునరుద్ధరించుకోవడం. మట్టితో తెగిన పేగుబంధాన్ని ఒకసారి ఆత్మీయంగా తడుముకోవడం. ముఖ్యంగా ఇంట్లో ఉన్న మహిళలు, చిన్నపిల్లలు, ఖాళీగా ఉన్నవారు ఈ మంచి ప్రయత్నాన్ని ఆరంభించలిగితే, ఆహారపరంగా, ఆరోగ్యపరంగా ఒక మంచి సంస్కృతిని మన కుటుంబంలో పాదుకొల్పినవారవుతారు. ఇంటిపై నిర్మించుకునే ఈ అనుబంధాల ఆకుపచ్చని పొదరిల్లు కేవలం ఆరోగ్యాన్ని మెరుగుపరుచడమేకాకుండా, నెమ్మదిగా ఒక కుటుంబాన్ని రోజూ కాసేపైనా కలుపలిగే ఒక అందమైన ప్రయత్నం అవుతుంది. -కె.క్రాంతికుమార్‌రెడ్డి నేచర్స్ వాయిస్

More in రైతుబ‌డి :