అర్పిందర్ అదరహో..

పతకం గెలిచిన తొలి భారత అథ్లెట్‌గా రికార్డుల్లోకి ఐఏఏఎఫ్ కాంటినెంటల్ కప్

ఒస్ట్రావా(చెక్ రిపబ్లిక్): సుదీర్ఘ స్వప్నం సాకారమైంది. ఇన్నాళ్లు ఊరించిన కల ఎట్టకేలకు నెరవేరింది. ప్రతిష్ఠాత్మక ఐఏఏఎఫ్ కాంటినెంటల్ కప్‌లో భారత్ తరఫున తొలి పతకం సాధించిన రికార్డును ట్రిపుల్ జంపర్ అర్పిందర్‌సింగ్ సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల ట్రిపుల్ జంప్ ఈవెంటులో అర్పిందర్ కాంస్య పతకంతో చరిత్ర సృష్టించాడు. ఇటీవలి ఇండోనేషియా ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకంతో మెరిసిన ఈ పంజాబీ పుత్తర్..కాంటినెంటల్ కప్‌లోనూ సత్తాచాటాడు. సెమీఫైనల్లో మొదటి మూడు ప్రయత్నాల్లో 16.59 మీటర్లు కాంస్యం ఖాయం చేసుకున్నాడు. అయితే తర్వాత ప్రయత్నంలో 16.33మీటర్లతో ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాడు.

ఆసియా పసిఫిక్ జట్టు తరఫున బరిలోకి దిగిన అర్పిందర్ అంచనాలకు అనుగుణంగా రాణించి పతకాన్ని అందుకున్నాడు. ఇదే విభాగంలో ఒలింపిక్, ప్రపంచ చాంపియన్ క్రిస్టియన్ టేలర్(అమెరికా, 17.59మీ), హ్యుగస్ ఫ్యాబ్రైస్(బుర్కినా ఫాసో, 17.02మీ) వరుసగా స్వర్ణ, రజత పతకాలు దక్కించుకున్నారు. పురుషుల జావెలిన్‌త్రోలో నీరజ్‌చోప్రా 80.24మీటర్లతో ఆరోస్థానంలో నిలిచి నిరాశపరిచాడు. పురుషుల 1500మీటర్ల రేసులో భారత స్ప్రింటర్ జిన్సన్ జాన్సన్ 3.41.72సెకన్ల టైమింగ్‌తో ఆరో స్థానంలో నిలిచాడు. మహిళల 3000మీటర్ల స్టిపుల్‌చేజ్‌లో సుధాసింగ్ తన రేసును ముగించలేకపోయింది.

Related Stories: