వడ్డీరేట్లు ఇంకా పెరగొచ్చు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: రాబోయే ద్రవ్యసమీక్షల్లో కీలక వడ్డీరేట్లు మరింత పెరుగవచ్చన్న అభిప్రాయాలు దేశీయ వ్యాపార, పారిశ్రామిక వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. భారతీయ పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన ఓ అధ్యయనంలో దాదాపు 42 శాతం సంస్థలు ఈ ఆర్థిక సంవత్సరం (2018-19).. రెపో, రివర్స్ రెపో రేట్లను ఆర్బీఐ ఇంకా పెంచవచ్చని అంచనా వేశాయి. గత రెండు ద్వైమాసిక ద్రవ్యసమీక్షల్లో కీలక వడ్డీరేట్లను 50 బేసిస్ పాయింట్ల చొప్పున ఆర్బీఐ పెంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముందున్న సమీక్షల్లోనూ వడ్డీరేట్లు ఇంకా పెరుగవచ్చని సర్వేలో పరిశ్రమ అభిప్రాయపడింది. ఇక ఈసారి కోతలు ఉండకపోవచ్చనీ మెజారిటీ సంస్థలు అన్నాయి. ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో చేపట్టిన ఈ సర్వేలో సుమారు 200ల వరకు చిన్న, పెద్ద సంస్థలు పాల్గొన్నాయి. వ్యాపార విశ్వాస సూచీ (బీసీఐ) 104వ త్రైమాసిక ఎడిషన్ విడుదల సందర్భంగా సీఐఐ ఈ సర్వే వివరాల్ని బహీర్గతం చేసింది. అక్టోబర్ 3 నుంచి 5 వరకు ద్రవ్యసమీక్ష జరుగనున్నది.