ఆదిమానవుల ఆనవాళ్లపై కొన్నెగుట్ట పరిసరాల్లో పరిశోధన

జనగామ: ఆదిమానవులు సంచరించిన బచ్చన్నపేట మండలం కొన్నె గుట్టలో నాటి ఆనవాళ్లను సేకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం పురవాస్తు శాఖ ఆద్వర్యంలో తవ్వకాలు ప్రారంభించారు. కొన్నె గుట్ట (గజగిరి) సమీపంలో రామచంద్రాపూర్ గ్రామ శివారు స్థలంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కె. పుల్లారావు ఆద్వర్యంలో ఆధునిక పద్దతిలో తవ్వకాలు చేపట్టారు. చరిత్రను బయటకు తీసేందుకు గాను తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహకంగా రూ. 3 లక్షలు మంజూరు చేసింది. ఈ పరిశోధనకు కేంద్ర ప్రభుత్వ అనుమతి ఉందని పుల్లారావు విలేకరులతో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్సిటి పరిశోధన బృందం సభ్యులు పది మందితో పురాతన ఆనవాళ్లను సేకరించేందుకు శ్రీకారం చుట్టామని అన్నారు. నాలుగు వేల ఏళ్ల క్రితం రాతి యుగంలో మానవుల పరిస్థితి వారి కుటుంబ జీవనం సాగిన విధానం, ఆహార పరిస్థితులపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయనున్నామని అన్నారు. ధాన్యం గింజలు, మట్టి పొరల్లో ఉన్న ఆ బొడిపెల ఆవశేషాలను గుర్తించడం జరుగుతుందన్నారు. సూక్ష్మ ఆధారాల సేకరణతో పరిశోధనలు చేస్తామని వెల్లడించారు. ముఖ్యంగా తొలి చారిత్రక యుగం, కొత్తరాతి యుగం, బృహత్‌శిలాయుగానికి చెందిన ఆనవాళ్లు, ఆవాసాలు ఈ ప్రాంతంలో ఉన్నట్లు తెలుసుకున్న సమాచారం మేరకు ఈ పరిశోధన చేపట్టామని అన్నారు. భూమి లోపల పది నుంచి పదిహేను అడుగుల లోతులో తవ్వకాలు చేపట్టి అందులో ఒక్కొక్క పొరల ఆధారంగా అధ్యయనం చేసి లండన్ యూనివర్సిటీ వర్సిటి విభాగాధిపతి డోరియన్ పుల్లర్‌కు నమూనాలను పంపిస్తామని పుల్లారావు తెలిపారు.

Related Stories: