కేరళ వరద బాధితుల కోసం రెహమాన్ మ్యూజికల్ షో

బషీర్‌బాగ్ : కేరళ వరద బాధితులకు సహాయాన్ని అందించేందుకు ఎస్‌కే మోహియోద్దీన్ మెమోరియల్ ట్రస్ట్, మూవీస్ ఇంటర్నేషనల్స్, ఎస్‌కే ఫిలీంస్ సంయుక్త ఆధ్వర్యంలో సెప్టెంబర్ 20వ తేదీన ఎల్బీస్టేడియంలో సాయంత్రం 7 గంటలకు ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ నైట్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సినీహీరో, ఎస్‌కే మోహియోద్దీన్ మెమోరియల్ ట్రస్ట్ ప్రతినిధి డాక్టర్ హబీబుద్దీన్ తెలిపారు. ఈ మేరకు బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు తెలంగాణ ఫిలిం అసోసియేషన్ సమక్షంలో ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ నైట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ రెహమాన్ ప్రముఖ సినీ హీరోలు సల్మాన్‌ఖాన్, షారూఖ్‌ఖాన్, అమీర్‌ఖాన్, అక్షయ్‌కుమార్, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, మమ్ముట్టి, దుల్హర్ సాల్మన్, మోహన్‌లాల్, విశాల్, సూర్య, విక్రమ్, అజిత్, పునీత్‌రాజ్ కుమార్, ఉపేంద్ర, చరణ్‌రాజ్, దీపికా పదుకొనె, ప్రియాంక చోప్రాలు పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి కనీస ఎంట్రీ ధర రూ.1000 ఉంటుందని, దాతలు ఎవరికి తోచిన విధంగా వారు సహాయం అందజేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంతో దాదాపు ఒక కోటీ రూపాయలు విరాళాలను సేకరించి సీఎం రిలీఫ్‌ఫండ్‌కు అందజేస్తామని ఆయన తెలిపారు. ఈ మ్యూజికల్ నైట్ కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరై బాధితులకు విరాళాలు అందించి ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
× RELATED ఆస్ట్రేలియా ఓపెన్‌లో పెను సంచలనం