మళ్లీ ఆ తప్పులు చేయను!

ఫలితాన్ని గురించి ఆలోచిస్తూ సినిమాలు చేయను. నటుడిగా నా ప్రతిభసామర్థ్యాల వల్లే ఇన్నేళ్లపాటు సినీ పరిశ్రమలో నిలదొక్కుకున్నాను. విజయాల్ని పరిపూర్ణంగా ఆస్వాదించే రోజు తప్పకుండా వస్తుందనే నమ్మకముంది అని అన్నారు నందమూరి తారకరత్న. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం రాజా చెయ్యి వేస్తే. నారా రోహిత్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ నెల 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా తారకరత్న శనివారం హైదరాబాద్‌లో పాత్రికేయులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ విశేషాలివి...
కథ ఈ సినిమాకు బలం. దర్శకుడు చెప్పిన కథను నమ్మి ఇందులో నటించడానికి అంగీకరించాను. ప్రదీప్ నా పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారు. నేను, రోహిత్ ఒకే కుటుంబం నుంచి వచ్చిన నటులం కావడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. మొదట దర్శకుడు నా పాత్ర గురించి చెప్పినప్పుడు విలన్‌గా నటించడానికి చాలా ఆలోచించాను. కానీ నిర్మాత సాయికొర్రపాటితో పాటు నా భార్య అందించిన ధైర్యంతో సినిమాలో నటించాలని నిర్ణయించుకున్నాను. ఈ సినిమా నటుడిగా నాకు సరికొత్త ఇమేజ్‌ను తెచ్చిపెడుతుందనే నమ్మకముంది

ఎత్తు పల్లాలు సహజం...

ప్రయాణంలో ఎత్తుపల్లాలు అనేవి సహజమని బాబాయ్ చాలా సార్లు చెప్పారు. ఫలితాన్ని గురించి పట్టించుకోకుండా కష్టపడుతున్నాను. నటుడిగా నాలో ప్రతిభ లేకపోతే ఇన్నాళ్లు పరిశ్రమలో వుండేవాణ్ణి కాదు. కెరీర్ పరంగా ఎలాంటి అసంతృప్తి లేదు. తప్పకుండా నాకంటూ సరైన సమయం వస్తుందనే నమ్మకముంది. కెరీర్ తొలినాళ్లలో చాలా వేగంగా సినిమాలు చేసి తప్పు చేశాను. దాంతో కథల విషయంలో చాలా పొరపాట్లు జరిగాయి. మళ్లీ ఆ తప్పుల్ని పునరావృతం చేయకూడదని అనుకుంటున్నాను. రాజా చెయ్యివేస్తే తర్వాత నా మనసుకు నచ్చిన సినిమాలే చేస్తాను. కెరీర్ విషయంలో ఏవైనా అనుమానాలు ఉంటే బాబాయ్‌ని సంప్రదిస్తాను. కానీ తుది నిర్ణయం మాత్రం నేనే తీసుకుంటాను. నాపై వచ్చే విమర్శల్ని చూసి నవ్వుకుంటాను. అంతే తప్ప ఎప్పుడూ నిరాశకు గురికాను. పరాజయాలు ఎదురైన ప్రతీసారి మరింత కష్టపడుతున్నాను.

ఎలాంటి విభేదాలు లేవు...

కుటుంబపరంగా మా మధ్య ఎలాంటి భేధాభిప్రాయాలు లేవు. నేను, కల్యాణ్‌రామ్, ఎన్టీఆర్ అందరం తరచుగా కలుస్తుంటాం. సినిమాల గురించి మాట్లాడుకుంటాం. మా మధ్య విభేదాలున్నాయని జరుగుతోన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు.

జూనియర్ ఆర్టిస్టుగా నటించడానికి సిద్ధం

బాబాయ్ బాలకృష్ణ వందో చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణిలో జూనియర్ ఆర్టిస్టుగా నటించే అవకాశం వచ్చినా అనందంగా అంగీకరిస్తాను. ప్రస్తుతం నేను నటించిన ఎవరు సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.