అపాచీ హెలికాప్టర్.. మేడిన్ ఆదిభట్ల

ఆదిభట్ల: రక్షణ ఉత్పత్తులకు తెలంగాణ కేంద్ర బిందువవుతున్నది. యుద్ధ హెలికాప్టర్ అపాచీ ప్రధాన భాగాలు ఇప్పుడు తెలంగాణలో తయారవుతున్నాయి. ఆదిభట్లలోని టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్ కేంద్రంలో అపాచీ ప్రధాన భాగాన్ని నిర్మిస్తున్నది. ఇవాళ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, టాటా సంస్థల అధినేత రతన్ టాటా, రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్.. ఆ కేంద్రాన్ని విజిట్ చేశారు. ఆదిభట్ల కేంద్రంలో జీరో డిఫెక్ట్‌తో హెలికాప్టర్ల తయారీ జరుగుతోందని అమెరికా సంస్థ వెల్లడించినట్లు కేంద్ర మంత్రి సీతారామన్ పేర్కొన్నారు. నిజానికి అపాచీ హెలికాప్టర్లను అమెరికా సైన్యం ఎక్కువగా వాడుతుంది. యుద్ధ సమయంలో ఈ హెలికాప్టర్లు మల్టీ కంబాట్ రోల్స్ ప్లేచేస్తాయి. రోబోట్లు తయారు చేస్తే లోపాలు ఉండవని, అదే తరహాలో ఎటువంటి లోపాలు లేని అపాచీ హెలికాప్టర్లను ఇక్కడ నిర్మిస్తున్నారని మంత్రి సీతారామన్ అన్నారు. తెలంగాణలోని ఆదిభట్లలో ఉన్న సౌకర్యాలు ఆ కచ్చితత్వాన్ని ప్రదర్శిస్తున్నాయన్నారు. అత్యంత నైపుణ్యం కలిగిన మానవ శక్తితోనూ లోపాలు లేని హెలికాప్టర్లు తయారు చేయవచ్చు అని ఆదిభట్ల యూనిట్ తెలియజేస్తున్నదని మంత్రి పేర్కొనడం గర్వకారణం. ఆదిభట్ల రక్షణ ఉత్పత్తుల ప్రాజెక్టును నిర్ణీత సమయానికే పూర్తి చేశారని, డెడ్‌లైన్ కంటే ముందే.. ఉత్పత్తులను డెలివరీ చేస్తున్నారని మంత్రి సీతారామన్ తెలిపారు. ప్రాజెక్టును ఎంత పకడ్బందీగా నిర్వహిస్తున్నారన్న దానికి ఇది నిదర్శనమని ఆమె అన్నారు. టాటా బోయింగ్ ఏరోస్పేస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అమెరికా అంబాసిడర్ కెన్ జెస్టర్ కూడా పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టుతో రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలు మరింత బలంగా మారాయన్నారు.
× RELATED యోగా టీచర్ కావాలనుకునే వారికి సువర్ణావకాశం..