అంకుర్ పసిడి షూట్

-డబుల్ ట్రాప్ ఈవెంటులో స్వర్ణం -షూటింగ్ ప్రపంచకప్
చాంగ్వాన్: ప్రతిష్ఠాత్మక షూటింగ్ ప్రపంచకప్‌లో భారత షూటర్ల జోరు కొనసాగుతున్నది. పోటీలకు ఏడో రోజైన శనివారం భారత్‌కు స్వర్ణంతో సహా ఓ కాంస్య పతకం దక్కింది. మొత్తంగా 20(7 స్వర్ణాలు, 7 రజతాలు, 6 కాంస్యాలు) పతకాలతో ఆతిథ్య కొరియా(23), చైనా(20) తర్వాత భారత్ మూడో స్థానంలో కొనసాగుతున్నది. పురుషుల డబుల్ ట్రాప్ ఈవెంటులో అంకుర్ మిట్టల్ పసిడి పతకాన్ని ముద్దాడాడు. ఫైనల్లో అంకుర్, చైనా షూటర్ యియాంగ్ యాంగ్ మధ్య పోరు హోరాహోరీగా సాగింది. ఇద్దరి స్కోర్లు సమం కావడంతో విజేతను నిర్ణయించేందుకు షూటాఫ్ నిర్వహించారు. ఇందులో 4-3 తేడాతో యాంగ్‌ను ఓడించి అంకుర్ స్వర్ణ పతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు.

అంద్రెజ్ హ్యుబర్ట్(స్లోవేకియా, 140+1)కు కాంస్య పతకం దక్కింది. మరోవైపు డబుల్ ట్రాప్ టీమ్ విభాగంలో భారత త్రయం అంకుర్ మిట్టల్, మహమ్మద్ అసబ్, శార్దుల్ విహాన్ 409 పాయింట్లతో కాంస్య పతకం కైవసం చేసుకుంది. ఇదే విభాగంలో ఇటలీ(411), చైనా(410) వరుసగా స్వర్ణ, రజత పతకాలు దక్కాయి. మిగతా విభాగాల్లో అంజుమ్ మౌడ్గిల్, మను భాకర్ తృటిలో పతక అవకాశాలను చేజార్చుకున్నారు. జూనియర్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంటులో మనీశా ఖీర్, మానవాదిత్యసింగ్ రాథో ద్వయం 139 స్కోరుతో ఫైనల్‌కు అర్హత సాధించినా నాలుగో స్థానంతో పతక సాధించే అవకాశాన్ని కోల్పోయారు.