నోటికొచ్చినట్లు మాట్లాడొద్దు.. కాంగ్రెస్‌కు రిలయెన్స్ వార్నింగ్!

న్యూఢిల్లీ: అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ డిఫెన్స్, రిలయన్స్ ఏరోస్ట్రక్చర్ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డాయి. రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం విషయంలో నోటికి వచ్చినట్లు మాట్లాడొద్దంటూ నోటీసులు పంపించాయి. బాధ్యతాయుతంగా మాట్లాడండి.. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆ సంస్థలు హెచ్చరించాయి. కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్‌కు ఈ నోటీసులు జారీచేశారు. వాక్‌స్వాతంత్య్రం పేరుతో బాధ్యతారహితంగా మాట్లాడటం సరికాదని ఆ నోటీసుల్లో రిలయన్స్ స్పష్టంచేసింది. తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఇతరులపై తప్పుడు ఆరోపణలు చేయొద్దని హెచ్చరించింది. ఇతర కాంగ్రెస్ ప్రతినిధులైన రణ్‌దీప్ సూర్జేవాలా, అశోక్ చవాన్, సంజయ్ నిరుపమ్, అనుగ్రహ్ నారాయణ్ సింగ్, ఊమన్ చాందీ, శక్తిసిన్హ్ గోహిల్, అభిషేక్ మను సింఘ్వి, సునీల్‌కుమార్ జఖార్, ప్రియాంకా చతుర్వేదిల పేర్లను కూడా ఈ నోటీసుల్లో చేర్చింది. వీళ్లంతా రిలయన్స్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆ సంస్థ తెలిపింది. తమ వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం రిలయన్స్ సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించింది. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారం తమకు ఉందని స్పష్టంచేసింది. అయితే ఈ నోటీసులను కాంగ్రెస్ ప్రతినిధి జైవీర్ షెర్గిల్ తేలిగ్గా తీసుకున్నారు. తాను కాంగ్రెస్ సైనికుడినని, ఇలాంటి హెచ్చరికలకు భయపడబోనని ట్వీట్ చేశారు. అదనంగా ఎందుకు 42 వేల కోట్లు ఎందుకు చెల్లించారో తెలుసుకునే హక్కు ఈ దేశంలోని ప్రతి పన్నుదారుడికి ఉందని ఆయన స్పష్టంచేశారు. ఈ మధ్యే రిలయెన్స్ చైర్మన్ అనిల్ అంబానీ కూడా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి లేఖ రాశారు. తమ వ్యాపార ప్రత్యర్థులు తమ ప్రయోజనాల కోసం మీకు తప్పుడు సమాచారం ఇచ్చారని ఆ లేఖలో రాహుల్‌కు చెప్పారు అనిల్ అంబానీ. చాలా రోజులుగా రాఫెల్ యుద్ధవిమానాల ఒప్పందం విషయంలో ప్రభుత్వంపై రాహుల్‌గాంధీ ఆరోపణలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఓ వ్యాపారవేత్తకు లబ్ధి చేకూర్చడానికి ఒప్పందంలో మార్పులు చేశారని రాహుల్ విమర్శిస్తున్నారు.

Related Stories: