అనగనగా ఓ ప్రేమకథ

విరాజ్ జె అశ్విన్, రిద్దికుమార్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం అనగనగా ఓ ప్రేమకథ. ప్రతాప్ తాతంశెట్టి దర్శకుడు. ప్రముఖ నిర్మాత డీవీఎస్ రాజు అల్లుడు కేఎల్‌ఎన్ రాజు థౌజెండ్ లైట్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా తొలి ప్రచార చిత్రాన్ని హీరో వరుణ్‌తేజ్ శుక్రవారం సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ మా సంస్థ నిర్మిస్తున్న తొలి చిత్రమిది. ఈ చిత్రం ద్వారా విరాజ్ జె అశ్విన్‌ను హీరోగా పరిచయం చేస్తున్నాం. సరికొత్త నేపథ్యంలో తెరకెక్కుతున్న ప్రేమకథా చిత్రమిది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి చిత్రాన్ని అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. విభిన్నమైన ప్రేమకథా చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్నందుకు ఆనందంగా వుంది. కొత్త తరహా చిత్రాల్ని ఇష్టపడే ప్రేక్షకుల్ని తప్పకుండా ఆకట్టుకుంటుంది అని హీరో తెలిపారు. కాశీవిశ్వనాథ్, అనీష్ కురువిళ్ల, వేణు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: కె.సి.అంజన్, పాటలు: శ్రీమణి, కెమెరా: ఎదురోలు రాజు, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: ప్రతాప్ తాతంశెట్టి.