చమురు ధరల తగ్గింపు మా చేతిలో లేదు: కేంద్రం

న్యూఢిల్లీ: విపక్షాల భారత్ బంద్‌కు ప్రజల మద్దతు లేదని బీజేపీ తెలిపింది. అంతర్జాతీయంగా ముడిపడిన అంశాలతోనే పెట్రో ధరలు పెరుగుతున్నాయని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. చమురు ధరలతో ప్రజల ఇబ్బందులు వాస్తవమైనా ఆ కష్టాలు తాత్కాలికమేనన్నారు. ఇంధన ధరల తగ్గింపు తమ చేతిలో లేదని, అయినప్పటికీ తగు చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తామన్నారు. దేశంలో భయానక వాతావరణాన్ని సృష్టించేందుకే విపక్షాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. బీహార్‌లో ఐదేండ్ల బాలికకు బంద్ వల్ల అంబులెన్స్ రాలేక ప్రాణాలు కోల్పోయింది. అందుకు రాహుల్ బాధ్యత వహిస్తారా? అని రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. తమ ప్రభుత్వం పలు ప్రజాసంక్షేమానికి కోట్ల రూపాయల్ని ఖర్చుచేస్తున్నదని, ఐదుకోట్ల మంది ప్రజల్ని దారిద్య్రరేఖ నుంచి బయటకు తెచ్చిందన్నారు.

మహాకూటమి బెలూన్ త్వరలోనే పేలుతుంది: నక్వీ

వదంతులతో ప్రజల్ని గందరగోళ పరిచేందుకే విపక్షాలు బంద్‌ను చేపట్టాయని కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ చెప్పారు. ధరల పెరుగుదల చరిత్ర కాం గ్రెస్ ప్రభుత్వాలదేనని, అధికారంలో లేకే ఇప్పుడు ఆ పార్టీ మొసలికన్నీరు కారుస్తున్నదన్నారు. అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీతో ఎవరు చేతులు కలిపినా నిండా మునిగిపోతారు. మహాకూటమి బెలూన్ కూడా త్వరలోనే పేలిపోతుంది అని అన్నారు. 2014 లో తమ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచీ దేశంలో ప్రతికూల వాతావరణాన్ని సృష్టించేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.