అమెజాన్ ఫ్లాష్ సేల్స్ పరంపర

-పండుగ సీజన్‌లో స్మార్ట్‌ఫోన్ల సందడి -దేశంలో తెలంగాణలోనే అధిక అమ్మకాలు -ఆకర్షణీయ బైబ్యాక్, ఈఎంఐ ఆఫర్లు
హైదరాబాద్, సెప్టెంబర్ 20: పండుగ సీజన్ సందర్భంగా ఫ్లాష్ సేల్స్ పరంపరతో మార్కెట్‌ను ముంచెత్తడానికి అమెజాన్ సిద్ధం అవుతోంది. స్మార్ట్‌ఫోన్ల విభాగంలో దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న రాష్ర్టాల్లో తెలంగాణ అగ్రగామిగా ఉందని అమెజాన్ స్మార్ట్‌ఫోన్ల అమ్మకాల విభాగపు అధిపతి నిషాంత్ సార్దానా తెలిపారు. వచ్చే 40 రోజుల్లో కనీసం 30 నుంచి 40 ఫ్లాష్ సేల్స్‌ను నిర్వహించనున్నట్టు చెప్పారు. గురువారం నాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ అమెజాన్ ఈఎంఐ పేరుతో రూ. 60 వేల వరకు రుణ సదుపాయన్ని కల్పించనున్నట్టు, ఇందుకోసం కాపిటల్ ఫ్లోట్ అనే కంపెనీతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు అన్నారు. జీరో వడ్డీతో గరిష్టంగా 24 నెలల వరకూ ఫైనాన్స్ సదుపాయాన్ని అమెజాన్ వినియోగదారులకు అందించనున్నట్టు పేర్కొన్నారు. దేశంలో అమ్ముడవుతున్న స్మార్ట్‌ఫోన్లలో 40 శాతం ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేస్తున్నారని వెల్లడించారు. కాగా, తెలంగాణలో స్మార్ట్‌ఫోన్ల ఎక్సేంజీ ఆఫర్‌ను కూడా ప్రవేశపెడుతున్నామని, ఈ సదుపాయాన్ని హైదరాబాద్‌తో పాటు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లా వినియోగదారులు ఉపయోగించుకోవచ్చునని వివరించారు.