మెట్రో స్తంభాల‌పై.. చ‌రిత్ర‌, సంస్కృతి

హైద‌రాబాద్‌: ఈ నెల 24న ప్రారంభించనున్న ఎల్బీనగర్ నుంచి మియాపూర్ మెట్రోరైలు కారిడార్ హెరిటేజ్ లుక్‌ను సంతరించుకోనుంది. ఈ మార్గంలో చారిత్రాత్మక కట్టడాలు ఉండటంతో వీటిని మరింత ఆకర్షించేలా తీర్చిదిద్దాలని పట్టణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఇంజినీర్ల బృందం పర్యటించి పనులను పరిశీలించి డిజైన్లు రూపొందించారు. కారిడార్1లోని నాంపల్లి చాదర్‌ఘాట్ పోలీసు కంట్రోల్ రూం వరకు 5 కిలోమీటర్ల మార్గంలో ఉన్న చారిత్రాత్మక కట్టడాలను పరిశీలించారు. ఐదు కిలోమీటర్ల పరిధిలోని స్టేట్ ఆర్కియాలజీ మ్యూజియం, రంగమహల్, చాదర్‌ఘాట్ ప్రాంతాల్లో పనులను తనిఖీ చేశారు.

అసెంబ్లీ, నాంపల్లి, గాంధీభవన్, ఓఎంసీ, ఎంజీబీఎస్ స్టేషన్ల మధ్య ఉన్న ప్రాంతాల్లో తిరిగి చేపట్టాల్సిన పనులపై దృష్టిసారించారు. ఈ ప్రాంతంలో ఫుట్‌పాత్‌లు నిర్మించాలని నిర్ణయించారు. చారిత్రక కట్టడాల రూపురేఖలు మారకుండానే వింటేజ్ లుక్ వచ్చేలా విద్యుత్‌స్తంభాలు, టైల్స్, రాళ్లు అమర్చి పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. పోలీస్ కంట్రోల్ రూంను కూడా రీమోడలింగ్ చేయాలని, పాదచారులు, ప్రయాణికులు సాఫీగా వెళ్లేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. క్లాక్ టవర్‌ను కూడా ప్రజలందరికీ కనబడేలా చర్యలు తీసుకోనున్నారు. అలాగే, నాంపల్లి రైల్వేస్టేషన్ నుంచి మెట్రోస్టేషన్‌కు అనుసంధానం చేసేలా 200 మీటర్ల స్కైవాక్ నిర్మించాలని సూచించారు. నాంపల్లి, గాంధీభవన్ స్టేషన్ల వద్ద మల్టీ లెవెల్ పార్కింగ్ సిస్టం అభివృద్ధి చేయనున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

ఎంజీబీఎస్ బస్‌స్టేషన్‌కు మెట్రోస్టేషన్ల మధ్య ప్రయాణికులు సులభంగా చేరడానికి స్కైవాక్‌లు నిర్మించనున్నట్లు స్పష్టం చేశారు. కారిడార్ 1, కారిడార్ 2 మధ్య ఉన్న రంగమహల్, ఓఎంసీ ప్రాంతంలో డబుల్‌డెక్కర్ స్ట్రక్చర్లను నిర్మిస్తున్నట్లు చెప్పారు. పర్యాటక ప్రాంతంగా విలసిల్లే క్రమంలో పర్యాటకులను ఆకర్షించేలా పేయింటింగ్స్, డెకరేషన్ చేయనున్నట్లు స్పష్టం చేశారు.

Related Stories: