16న వీఆర్వో పరీక్షకు ఏర్పాట్లుపూర్తి

-హాజరుకానున్న దాదాపు 11 లక్షల మంది అభ్యర్థులు -ఇప్పటికే 7.7 లక్షల మందికి చేరిన హాల్‌టిక్కెట్లు -టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ వాణీప్రసాద్ వెల్లడి హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని రెవెన్యూశాఖలో గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో) పోస్టుల భర్తీకి ఈ నెల 16న నిర్వహించే రాత పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి ఏ వాణీప్రసాద్ చెప్పారు. పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా దాదా పు 11 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారని చెప్పారు. పరీక్షల కోసం 31 జిల్లాల్లో 2,945 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశామని పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. హెచ్‌ఎండీఏ పరిధిలో 627 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశామని, ఆ కేంద్రాల్లో దాదాపు మూడులక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారని చెప్పారు. కొన్ని జిల్లాల్లో అభ్యర్థులు కోరుకున్న ప్రాంతాల్లో కాకుండా కొంతదూరంలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశామని, అభ్యర్థులు సహకరించాలని విజ్ఞప్తిచేశారు. దరఖాస్తు చేసుకున్న వారిలో బుధవారంనాటికి 7.7 లక్షల మంది అభ్యర్థులకు హాల్‌టిక్కెట్లు అందాయని పేర్కొన్నారు. అందరి సహకారంతో ఈ పరీక్షలను టీఎస్‌పీఎస్సీ విజయవంతంగా నిర్వహిస్తుందని చెప్పారు. పరీక్షల నిర్వహణకు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో విద్యుత్‌శాఖ, ఆర్టీసీ అధికారులు, పోలీసులు సహకరిస్తున్నారని తెలిపారు. అభ్యర్థుల సందేహాల నివృత్తి కోసం జిల్లాలవారీగా సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఆ వివరాలను కూడా అభ్యర్థులకు తెలియజేస్తున్నామని తెలిపారు. పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న రెండువేలకుపైగా విద్యార్థుల వివరాలు సరిగాలేవని, వారి కోసం ఎడిట్ ఆప్షన్ ఇచ్చామని చెప్పారు.