54 ఏండ్లకే జాక్ మా రిటైర్!

-రేపు అలీబాబాకు గుడ్‌బై?.. అదేరోజు వారసుడి ప్రకటన బీజింగ్, సెప్టెంబర్ 8: చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా సహ వ్యవస్థాపకుడైన జాక్ మా సంచలన నిర్ణయం తీసుకున్నారు. సోమవారం జాక్ మా 54వ ఏట అడుగుపెట్టనుండగా, అదే రోజున రిటైర్మెంట్ ప్రకటన చేస్తానని ప్రకటిం చారు. ఈ మేరకు న్యూయార్క్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మా స్పష్టం చేశారు. అయితే వారసత్వ ప్రణాళికనే మా ప్రకటిస్తారని, మరికొంత కాలం ఆయనే ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉంటారని అలీబాబా ప్రతినిధి ఒకరు తెలిపినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వార్తా పత్రిక తెలిపింది. 1999లో 18 మందితో కలిసి 60 వేల డాలర్ల పెట్టుబడితో అలీబాబా డాట్‌కామ్‌ను జాక్ మా ప్రారంభించారు. ప్రస్తుతం సంస్థ మార్కెట్ విలువ 420.8 బిలియన్ డాలర్లుగా ఉన్నది. కాగా, అలీబాబా స్థాపనకు ముందు జాక్ మా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగారు. విద్యార్థులకు ఆంగ్ల బోధనలు చేశారు. ఈ క్రమంలో రిటైర్మెంట్ అనంతరం తిరిగి తనకు ఇష్టమైన ఉపాధ్యాయ వృత్తిలోకే వెళ్లాలనుకుంటున్నట్లు బ్లూంబర్గ్ టీవీకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మా చెప్పారు. బిల్‌గేట్స్ తనకు ఆదర్శమన్న ఆయన మా ఫౌండేషన్ ద్వారా సమాజ సేవ చేస్తానన్నారు.