బాక్సింగ్ డే టెస్ట్.. కంగారూలకు కుక్ పంచ్

మెల్‌బోర్న్‌ః ఇప్పటికే యాషెస్ సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్ నాలుగోదైన బాక్సింగ్ డే టెస్ట్‌లో పుంజుకున్నది. సీనియర్ బ్యాట్స్‌మన్, ఓపెనర్ అలిస్టర్ కుక్ కెరీర్‌లో ఐదో డబుల్ సెంచరీ చేయడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌కు భారీ ఆధిక్యం దక్కింది. ఈ సిరీస్‌లో ఫామ్ కోసం తంటాలు పడిన కుక్.. ఆలస్యంగానైనా ఇంగ్లండ్ పరువు నిలిపే ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లకు 491 పరుగులు చేసింది. రూట్ సేన ఇప్పటికే తొలి ఇన్నింగ్స్‌లో 164 పరుగులు లీడ్‌లో ఉంది. కుక్ 244 పరుగులు చేసి ఇంకా క్రీజులో ఉన్నాడు. మొదట కెప్టెన్ రూట్ (61)తో కలిసి మూడో వికెట్‌కు 138 పరుగులు జోడించిన కుక్.. ఆ తర్వాత టెయిలెండర్లతో కలిసి ఇంగ్లండ్‌కు కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందించాడు. క్రిస్ వోక్స్ (26)తో కలిసి ఏడో వికెట్‌కు 60 పరుగులు, బ్రాడ్ (56)తో కలిసి 9వ వికెట్‌కు వంద పరుగులు జోడించడంతో ఇంగ్లండ్‌కు భారీ ఆధిక్యం దక్కింది. మూడో రోజే కెరీర్‌లో 32వ సెంచరీని పూర్తి చేసిన కుక్.. నాలుగో రోజు కూడా క్రీజులో పాతుకుపోయాడు. ఓవైపు సహచర బ్యాట్స్‌మెన్ ఒక్కొక్కరుగా పెవిలియన్ చేరుతున్నా.. కుక్ మాత్రం వికెట్లకు అడ్డుగోడలా నిలిచాడు. ఇప్పటికే సిరీస్ కోల్పోయినా.. కుక్ ఆడిన ఈ మారథాన్ ఇన్నింగ్స్ కనీసం వైట్‌వాష్ కాకుండా ఇంగ్లండ్‌ను గట్టెక్కించే అవకాశం ఉంది.
× RELATED 16 మంది సీఎంలు పాలించినా అభివృద్ధి శూన్యం