అరుదైన ఘనత

ఇంగ్లండ్ ఓపెనర్ అలిస్టర్ కుక్ అరుదైన ఘనత అందుకున్నాడు. టెస్ట్‌ల్లో అరంగేట్రంతో పాటు ఆఖరి మ్యాచ్‌లో సెంచరీ చేసిన ఐదో బ్యాట్స్‌మన్‌గా కుక్ రికార్డుల్లోకెక్కాడు. తన తొలి, చివరి సెంచరీ భారత్‌పైనే నమోదు చేయడం విశేషం. 2006లో నాగ్‌పూర్‌లో భారత్‌పై అరంగేట్రం చేసిన కుక్ రెండో ఇన్నింగ్స్‌లో అజేయ సెంచరీ(104)తో ఆకట్టుకోగా, తాజాగా ఓవల్‌లో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో 147 పరుగులతో విజృంభించాడు. దీని ద్వారా ఈ అరుదైన ఫీట్ అందుకున్న తొలి ఇంగ్లండ్ క్రికెటర్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా టెస్ట్‌ల్లో ఇప్పటివరకు ఐదుసార్లు ఈ ఫీట్ నమోదైతే..ఒకే ప్రత్యర్థిపై మూడుసార్లు రికార్డు సొంతమైంది. ఐదింటిలో మూడుసార్లు ఒకే వేదిక కెన్నింగ్టన్ ఓవల్‌లోనే నమోదం అవడం ఆశ్చర్యం కల్గించే అంశం. మాజీ కెప్టెన్, హైదరాబాదీ మహమ్మద్ అజారుద్దీన్ భారత్ తరఫున ఈ ఫీట్‌ను అందుకున్న క్రికెటర్‌గా రికార్డు అందుకోగా, మిగతా ముగ్గురు ఆస్ట్రేలియా క్రికెటర్లు రెగినాల్డ్ డఫ్, విలియమ్ పోన్స్‌ఫోర్డ్, గ్రెగ్ చాపెల్ జాబితాలో ఉన్నారు.

కుక్ @ 5: టెస్ట్‌ల్లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగుల రికార్డు వీరుడైన అలిస్టర్ కుక్..మరో ఘనతను అందుకున్నాడు. భారత్‌తో ఐదో టెస్ట్‌లో సెంచరీ ద్వారా టెస్ట్‌ల్లో 12472 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. ఈ క్రమంలో శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర(12400)ను అధిగమిస్తూ అత్యధిక పరుగుల జాబితాలో ఐదో స్థానానికి ఎగబాకాడు. 76 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కుక్ ఈ రికార్డును చేరుకున్నాడు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్(15921), రికీ పాంటింగ్(13378), కలిస్(13289), రాహుల్ ద్రవిడ్(13288) మొదటి నాలుగో స్థానాల్లో ఉన్నారు.