చిట్టీ రీలోడెడ్ విత్ సూపర్ పవర్స్

చిట్టి చిట్టి రోబో.. అంటూ రోబో సినిమాతో దక్షిణాదిలో సంచలనాన్ని సృష్టించారు దర్శకుడు శంకర్. 2010లో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు ఘనవిజయాన్ని దక్కించుకున్నది. తాజాగా రోబో చిత్రానికి 2.ఓ పేరుతో సీక్వెల్‌ను తెరకెక్కించారు శంకర్. రజనీకాంత్, అక్షయ్‌కుమార్ వంటి అగ్ర తారాగణంతో దాదాపు ఐదు వందల కోట్ల బడ్జెట్‌తో భారతీయ చిత్ర పరిశ్రమలోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందిన చిత్రంగా 2.ఓ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. త్రీడీ సాంకేతికత, 4డీ సౌండ్‌తో పాటు అత్యాధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ శంకర్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ నెల 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానున్న ఈ సినిమా కోసం భాషాభేదాలకు అతీతంగా యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పర్యావరణ, సమాజ వినాశానికి ఎలా దారితీస్తుందోననే పాయింట్‌తో తెరకెక్కిన చిత్రమిది. సామాజిక ఇతివృత్తానికి వాణిజ్య విలువలను మేళవిస్తూ శంకర్ ఈ కథను రాసుకున్నారు. 2015లో సిద్ధంచేసిన ఈ కథలో చిన్న మార్పు కూడా చేయకుండా తెరపై ఆవిష్కరించినట్లు తెలిసింది. తొలుత మూడు వందల కోట్ల బడ్జెట్‌తో పాటలు లేకుండా థ్రిల్లర్ సినిమా మాదిరిగా ఈ చిత్రాన్ని రూపొందించాలని శంకర్ భావించారట. కానీ గ్రాఫిక్స్, వీఎఫ్‌ఎక్స్ ప్రాధాన్యమున్న కథ కావడంతో బడ్జెట్ ఐదు వందల కోట్లకు చేరుకుంది. సినిమా బడ్జెట్‌లో మూడోవంతు వ్యయాన్ని వీఎఫ్‌ఎక్స్ కోసమే వెచ్చించినట్లు తెలిపారు. ఏడాదిన్నర సమయంలో ఈ సినిమాను పూర్తిచేయాలని అనుకున్నా..గ్రాఫిక్స్ కారణంగా దాదాపు నాలుగేళ్లు పట్టినట్లు చిత్రబృందం చెబుతున్నది. రోబో కంటే పది రేట్లు పెద్ద సినిమా ఇదని, చిట్టి పాత్ర తొలి భాగంలో కంటే శక్తివంతంగా కనిపిస్తుందని శంకర్ చెబుతున్నారు.

గ్రాఫిక్స్ ముడిపడిన కథ కావడంతో బడ్జెట్ వృథా కాకుండా త్రీడీ యానిమేషన్ రూపంలో ప్రీవిజువలైజేషన్ సన్నివేశాల్ని చిత్రీకరించారు. ఈ ప్రీవిజువలైనేషన్ వల్ల లైటింగ్, కెమెరా ప్లేస్‌మెంట్స్‌తో పాటు దర్శకుడు, సినిమాటోగ్రాఫర్‌కు సన్నివేశంపై పూర్తిస్థాయిలో అవగాహన ఏర్పడుతుంది. ఈ సినిమాలోని 1300 సన్నివేశాల్ని త్రీడీ యానిమేషన్ ద్వారా చిత్రీకరించారు శంకర్. తన ఊహలు, ఆలోచనలకు అనుగుణంగా పాత్ర దారులకు సంబంధించిన రూపురేఖలు, ఆహార్యాలతో పాటు సినిమాలో ఉపయోగించిన రోబొటిక్ ఆర్మ్స్, యుద్ద ట్యాంకులు, పక్షుల ఆకారాలను పదిమంది కాన్సెప్ట్ ఆర్టిస్టులతో ముందుగా సిద్ధంచేశారు. వీటి కోసం ప్రత్యేకంగా రెండు బృందాలు పనిచేసినట్లు సమాచారం. తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను తెరకెక్కించారు. తెలుగు, జపనీస్, కొరియన్, చైనీస్‌తో పాటు మొత్తం పదిహేను భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదలచేయబోతున్నారు. ఇటీవలే విడుదలచేసిన ఈ చిత్ర ట్రైలర్‌కు అన్ని భాషల్లో కలిపి దాదాపు నూటయాభై మిలియన్ల వీక్షణలు(పదిహేను కోట్లు) లభించాయి. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాష్‌కరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ప్రోస్తటిక్ మేకప్‌తో..

ఈ సినిమాలో ప్రతినాయకుడిగా బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ నటించారు. ఈ చిత్రంతోనే తమిళ చిత్రసీమలో ఆయన అరంగేట్రం చేయబోతున్నారు. ఇందులో క్రోమాన్ అనే పాత్రలో కనిపించబోతున్నారాయన. ప్రయోగం కారణంగా రాక్షసరూపంలోకి ఆయన మారిపోతారని అంటున్నారు. పక్షి ఈకలను పోలిన కనురెప్పలు, కోర పళ్లతో గద్దను పోలిన రూపంలో ఆయన కనిపించబోతున్నారు. తొలుత ఈ పాత్ర కోసం హాలీవుడ్ సూపర్‌స్టార్ ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్‌ను తీసుకోవాలని భావించారు. భారీస్థాయిలో ఆయనకు పారితోషికం చెల్లించడానికి నిర్మాతలు అంగీకరించారు. అనివార్య కారణాల వల్ల ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో కమల్‌హాసన్‌ను సంప్రదించినట్లు దర్శకుడు శంకర్ చెప్పారు. ప్రతినాయకుడిగా నటించడానికి కమల్‌హాసన్ ఆసక్తిని చూపించలేదు. ఆ తర్వాత హృతిక్‌రోషన్, అమీర్‌ఖాన్, విక్రమ్‌లలో ఒకరిని తీసుకోవాలని భావించారు. చివరకు అక్షయ్‌కుమార్ ఈ సినిమాలో భాగమయ్యారు. ఈ సినిమా మొత్తం ఆయన ప్రోస్తటిక్ మేకప్‌తో కనిపించనున్నారు. క్రోమాన్ పాత్ర కోసం ప్రతిరోజు మేకప్ కోసం మూడు గంటలు సమయం పట్టేదని చెప్పారు అక్షయ్‌కుమార్. ఈ సినిమా నిర్మాణ విషయంలో శంకర్ సృజనాత్మక ప్రతిభ తనను ఆశ్చర్యానికి గురిచేసిందని అక్షయ్‌కుమార్ పేర్కొన్నారు.

హాలీవుడ్ స్టంట్‌మాస్టర్స్..

ఏ.ఆర్.రెహమాన్, నీరవ్‌షా, రసూల్ పూకుట్టి, శ్రీనివాస్ మోహన్ వంటి భారతీయ అగ్ర సాంకేతిక నిపుణులతో పాటు పలువురు హాలీవుడ్ సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం పనిచేశారు. మూడు వేల మంది సాంకేతిక నిపుణుల శ్రమకు నిదర్శనమే ఈ చిత్రమని శంకర్ తెలిపారు. మన దేశంతో పాటు విదేశాలకు చెందిన 25 వీఎఫ్‌ఎక్స్ స్టూడియోలకు చెందిన 1000 మంది వీఎఫ్‌ఎక్స్ ఆర్టిస్టులు గ్రాఫిక్స్ అందించే బాధ్యతను తీసుకున్నారు. మొత్తం 2150 వీఎఫ్‌ఎక్స్ షాట్స్ ఈ సినిమాలో ఉంటాయని చిత్రబృందం పేర్కొన్నది. నేటివ్ త్రీడీ, యానిమేట్రిక్స్ వంటి పలు సాంకేతిక పరిజ్ఞానాల్ని ఈ సినిమా కోసం ఉపయోగించారు. పది మంది కాన్సెప్ట్ ఆర్టిస్టులు, 25 మంది త్రీడీ డిజైనర్లు, 500 మంది క్రాఫ్ట్‌మెన్స్ సినిమాలో వస్తువులు, పాత్రధారులకు సంబంధించి దస్తులను సిద్ధంచేశారు. భారీ పోరాట ఘట్టాలతో కూడిన ఈ సినిమా కోసం బ్రేవ్‌హార్ట్, 28 డేస్ లేటర్ సినిమాలకు పనిచేసిన హాలీవుడ్ స్టంట్‌మాస్టర్ నిక్ పావెల్, కింగ్స్‌మెన్, ట్రాన్స్‌ఫార్మర్స్ ఫేమ్ కెన్నీ బాట్స్, స్టీవ్ గ్రిఫ్ఫిన్‌తో పాటు తమిళ ఫైట్ మాస్టర్ సెల్వా పనిచేశారు. ఈ చిత్రానికి వీఎఫ్‌ఎక్స్ డైరెక్టర్స్‌గా శ్రీనివాస్ మోహన్‌తో పాటు హాలీవుడ్‌కు చెందిన రిఫ్ డౌచర్, వాల్ట్ జోన్స్ పనిచేశారు.

తొలి త్రీడీ సినిమా ఇదే.

హాలీవుడ్‌తో పాటు ఇతర భాషల్లో త్రీడీ సినిమాను నేరుగా తెరకెక్కించరు. 2డీ వెర్షన్‌లో సినిమా తీసిన తర్వాత త్రీడీలోకి మారుస్తుంటారు. కానీ శంకర్ మాత్రం ఈ సినిమాను పూర్తిగా త్రీడీ విధానంలోనే తెరకెక్కించారు. భారతీయ సినీ చరిత్రలో త్రీడీలో రూపొందిన తొలి సినిమా ఇదే.త్రీడీలో నేరుగా తీయడం వల్ల ఓ సాధారణ సన్నివేశం తెరకెక్కించడానికంటే ఒకటిన్నర రేట్లు ఎక్కువగా కష్టం ఇమిడి వుంటుంది. త్రీడీ విధానం కోసం సినిమాటోగ్రాఫర్ నీరవ్‌షాతో పాటు కాట్ పెర్రీ, యు2, ది బ్లాక్ ఐడ్ పియాస్ లాంటి కాన్సెర్ట్ సినిమాలకు పనిచేసిన హాలీవుడ్ స్టీరియోగ్రాఫర్ రే హన్నిసన్ నాలుగేళ్ల పాటు కష్టపడ్డారు. వర్చువల్ కెమెరాలతో పాటు స్పైడర్‌కామ్, వీ కామ్ టెక్నాలజీ, లేజర్ స్కానింగ్ లాంటి ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సినిమాను చిత్రీకరించారు. దీని వల్ల ప్రేక్షకులను కథలో భాగం చేయడమే కాకుండా సహజత్వంతో కూడిన బెస్ట్ విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించబోతున్నారు. కథ డిమాండ్ మేరకే ఈ సినిమాను త్రీడీలో తెరకెక్కించామని దర్శకుడు శంకర్ చెప్పారు. 2.0 స్ఫూర్తితో మన దేశంలో మరిన్ని త్రీడీ చిత్రాల రూపకల్పన పెరుగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తంచేశారాయన. సినిమా చిత్రీకరణలో త్రీడీ విధానంలో తెరకెక్కించిన తొలి సన్నివేశం చూసి ఆశ్చర్యపోయాను. మళ్లీ మళ్లీ చూస్తునే ఉండిపోయాను అని రజనీకాంత్ చెప్పారు.

రికార్డ్ ప్రీరిలీజ్ బిజినెస్

విడుదలకుముందే 2.ఓ చిత్రం 550 కోట్ల బిజినెస్‌ను పూర్తిచేసుకొని రికార్డులను సృష్టించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తమిళనాడులో 90 కోట్లు, తెలంగాణ, ఆంధ్రాలలో 85 కోట్లు, కేరళలో 14.5 కోట్లు, హిందీ 85 కోట్లు, ఓవర్సిస్‌లో వంద కోట్లపైగా బిజినెస్ పూర్తయినట్లు తెలిసింది. ఈ చిత్ర శాటిలైట్ హక్కులు 110 కోట్లు, డిజిటల్ రైట్స్ 54 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం.

4డీ సౌండ్‌తో..

ఈ సినిమాతో 4డీ సౌండింగ్ విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. థియేటర్‌లో కాళ్ల క్రింద స్పీకర్లు ఉన్న అనుభూతి ప్రేక్షకులకు పంచడంతో పాటు చిన్న శబ్దాలను సైతం సహజంగా వినే వెసులుబాటు ఇందులో ఉంటుంది. 4డీ సౌండింగ్‌తో సినిమా చేయాలనే తన కల 2.ఏ సినిమాతో నెరవేరిందని దర్శకుడు శంకర్ చెబుతున్నారు.

శివాజీ, రోబో తర్వాత రజనీకాంత్, శంకర్ కలయికలో వస్తున్న మూడో సినిమా ఇది. ఇందులో రజనీకాంత్ వశీకరణ్ అనే శాస్త్రవేత్తగా, చిట్టి అనే రోబోగా కనిపించారు. తొలి భాగంలో చిట్టి పాత్ర ప్రతినాయక ఛాయలతో సాగగా ఈ సీక్వెల్‌లో మాత్రం హీరోగా కనిపించబోతున్నట్లు తెలిసింది. అలాగే మరో విభిన్నమైన పాత్ర ద్వారా రజనీకాంత్ ప్రేక్షకుల్ని సర్‌ప్రైజ్ చేయబోతున్నట్లు తెలిసింది. అదేమిటనేది చిత్రబృందం సస్పెన్స్‌గా ఉంచుతున్నారు. దాదాపు పన్నెండు కిలోల బరువున్న సూట్‌ను ధరించి సినిమా మొత్తం నటించారు

రజనీకాంత్. షూటింగ్ ప్రారంభించిన ఐదారు రోజులకు రజనీకాంత్ అనారోగ్యానికి గురవడంతో సినిమా నుంచి తప్పుకోవాలని అనుకున్నారట. సినిమా కోసం తాను తీసుకున్న పారితోషికాన్ని వెనక్కి ఇవ్వాలని భావించినట్లు ఆయన చెప్పారు. కానీ శంకర్‌తో పాటు నిర్మాత అందించిన సహకారం వల్లే తిరిగి ఆయన సినిమా చేసినట్లు పేర్కొన్నారు. పతాక ఘట్టాల చిత్రీకరణతో రజనీకాంత్ గాయపడ్డారు. అయినా వాటిని లెక్కచేయకుండా షూటింగ్ పూర్తిచేశారు. ఇందులో అమీజాక్సన్ రోబోగానే కనిపించబోతున్నట్లు తెలిసింది.