అజేయ భారత్-అటల్ బీజేపీ

-లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ నినాదం -వాజపేయి సిద్ధాంతాలను, విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపు -మహా కూటమికి నాయకత్వ కొరత ఉందంటూ చురకలు -అధికారంపై విపక్షాల పగటి కలలు.. మోదీ ఓటమే విపక్షాల ఎజెండా: హోంమంత్రి రాజ్‌నాథ్ -రామమందిరం, రాఫెల్ ఊసే లేని రాజకీయ తీర్మానం
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మాజీ ప్రధాని వాజపేయి పేరును ఉపయోగించుకుని కేంద్రంలో మళ్లీ అధికారం చేపట్టాలని బీజేపీ భావిస్తున్నది. పార్టీ సిద్ధాంతాల పట్ల వాజపేయి నిబద్ధత, ఆయన హయాంలో జరిగిన దేశ ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. అందులో భాగంగా అజేయ భారత్ అటల్ బీజేపీ నినాదంతో ముందుకెళ్లాలన్నారు. త్వరలో నాలుగు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రెండు రోజుల పాటు ఢిల్లీలో సాగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు సందర్భంగా ఆదివారం మోదీ మాట్లాడుతూ అజేయ భారత్-అటల్ బీజేపీ అంటే ఎదురులేని భారత్-ధృడమైన బీజేపీ అని అర్థం అని పేర్కొంటూ పార్టీ విజయాన్ని ఏ ఒక్కరూ అడ్డుకోలేరన్నారు.

తమ పార్టీకి వ్యూహాలు, సిద్ధాంతాలు ఉన్నాయన్నారు. సమయానుకూలంగా వ్యూహాలు మారుతుంటాయని చెప్పారు. 48 ఏండ్లకు పైగా గాంధీ కుటుంబం సారథ్యంలోని కాంగ్రెస్ హయాంలో సాధించిన ప్రగతి కంటే బీజేపీ 48 గంటల పాలనలోనే ఎంతో పురోగతి సాధించిందన్నారు. కాంగ్రెస్ పాలన, తమ పాలనను సరిపోల్చుకుని తీర్పు చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. భీమా-కోరెగావ్ కేసులో అర్బన్ నక్సల్స్ పేరుతో మానవ హక్కుల కార్యకర్తలను అరెస్ట్ చేసినందుకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను అభినందించారు. వచ్చే ఎన్నికల్లో 2014 కంటే ఎక్కువ సీట్లలో విజయం సాధిస్తామని ప్రధాని మోదీ చెప్పారు.

ప్రతిపక్ష పాత్ర పోషించడంలో కాంగ్రెస్ విఫలం

దేశంలోనే అతిపెద్ద ప్రతిపక్షంగా కాంగ్రెస్ తన పాత్ర పోషించడంలో విఫలమైందని, దేశంలో ఏ చిన్న రాజకీయ పార్టీ కూడా కాంగ్రెస్ నాయకత్వాన్ని అంగీకరించేందుకు సిద్ధంగా లేదని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌లోనూ రాహుల్ గాంధీ నాయకత్వాన్ని అంగీకరించేందుకు కొందరు సిద్ధంగా లేరన్నారు. తమను ఎదుర్కొనే సత్తా లేకే విపక్షాలు కూటమి కడుతున్నాయన్నారు. అయినా విపక్షాలకు నాయకత్వ కొరత ఉన్నదని చెప్పారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో నిత్యం పెరుగుతున్న పెట్రో ధరల గురించి గానీ, రాఫెల్ ఒప్పందంతోపాటు అయోధ్యలో రామ మందిరం నిర్మానం ఊసే ఎత్తలేదు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ కేవలం ప్రధాని మోదీని ఓడించడమే ప్రతిపక్షాల ఎజెండా అని ఆరోపించారు. కాషాయ పార్టీని ఓడించగలమన్న విపక్షాల భ్రమ కేవలం పగటి కల మాత్రమేనని స్పష్టం చేశారు.

వచ్చే 50 ఏండ్లు మాదే అధికారం: అమిత్‌షా

మరో 50 ఏండ్లు తమదే అధికారం అని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడుతూ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.1947లో కాంగ్రెస్ పార్టీ దేశంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి 1967 వరకు ఏకఛత్రాధిపత్యంగా అధికారంలో ఉన్నదన్నారు. బీజేపీ కూడా అదే ఒరవడిని పునరావృతం చేస్తుందన్నారు. 2001లో గుజరాత్ సీఎంగా నరేంద్రమోదీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు బీజేపీ ఓడిపోలేదని చెప్పారు. తొమ్మిది కోట్ల మంది కార్యకర్తల వాణి 36-40 కోట్ల మందికి వెళుతుందన్నారు. అయితే దేశవ్యాప్తంగా 21 కోట్ల కుటుంబాలకు మన వాణిని తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. 2014 ఎన్నికల నుంచి ఇప్పటివరకు 300 లోక్‌సభ స్థానాల పరిధిలో పర్యటించిన ప్రధాని మోదీ వచ్చే ఎన్నికల నాటికి మిగతా స్థానాలనూ చుట్టేస్తారన్నారు.