ముక్క‌లుగా ఎయిరిండియా అమ్మ‌కం!

న్యూఢిల్లీ: అప్పుల ఊబిలో చిక్కుకొని ప్ర‌భుత్వానికి భారంగా మారిన ఎయిరిండియాను భాగాలుగా చేసి అమ్మాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం భావిస్తున్న‌ది. ఈ నేష‌న‌ల్ కారియ‌ర్ అమ్మకాన్ని వేగ‌వంతం చేయాల‌ని ప్ర‌ధాని మోదీ భావిస్తున్న నేప‌థ్యంలో ఈ కొత్త ప్ర‌తిపాద‌న తెర‌పైకి వ‌చ్చింది. ఎయిరిండియా 55 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోగా.. కేంద్రం ఇప్ప‌టికే రూ.23 వేల కోట్లు భ‌రించింది. గ‌తంలోనూ ఎయిరిండియా అమ్మ‌కానికి ప్ర‌య‌త్నించినా.. అవి విజ‌య‌వంతం కాలేదు. వ‌చ్చే ఏడాది మొద‌ట్లోగా ఎయిరిండియా అమ్మ‌కం ప్ర‌క్రియ ప్రారంభించాల‌ని ప్ర‌భుత్వం భావిస్తున్న‌ది. అయితే ఇందులో ఉన్న ప్ర‌భుత్వ వాటాను పూర్తిగా అమ్మేయాలా లేదా అన్న‌దానిపై ఇంకా ఏ నిర్ణ‌యం తీసుకోలేదు. దేశ‌వ్యాప్తంగా సంస్థ‌కు రూ.30 వేల కోట్ల ఆస్తులున్నాయి. ప్రస్తుతానికి ఎయిరిండియాను కొనుగోలు చేయ‌డానికి టాటా గ్రూప్‌, ఇండిగో ఆస‌క్తి చూపుతున్నాయి. ప్ర‌భుత్వం కూడా ఎయిరిండియా బ‌య‌టి వ్య‌క్తుల‌కు అమ్మొద్ద‌న్న ఉద్దేశంతో ఉంది. దీనిపై అరుణ్ జైట్లీ నేతృత్వంలో ఐదుగురు మంత్రులు స‌భ్యులుగా ఉన్న‌ క‌మిటీ ఈ నెల‌లో స‌మావేశ‌మై ఎయిరిండియా అమ్మకానికి సంబంధించిన విధివిధానాల‌ను రూపొందించ‌నుంది. పీఎంవోకు చెందిన అధికారులు కొంద‌రు ఇప్ప‌టికే ర‌త‌న్ టాటాను క‌లిసి ఎయిరిండియాపై చ‌ర్చించారు. నిజానికి 1930లో టాటా గ్రూపే ఎయిరిండియాను ప్రారంభించింది. 1953లో ఇది జాతీయ‌మైన త‌ర్వాత ఎయిరిండియాగా మారింది. ఇప్పుడు మ‌ళ్లీ మాతృసంస్థ చేతికి వెళ్తే మంచిదే అని ప్ర‌భుత్వం కూడా భావిస్తున్న‌ది.

Related Stories: