ప్రధానమంత్రి ర్యాలీకే నో చెప్పిన పోలీసులు!

అహ్మదాబాద్: ఎవరైతే మాకేంటి అంటున్నారు అహ్మదాబాద్ పోలీసులు. శాంతిభద్రతలు, నగర ప్రజలకు ఇబ్బంది కలిగేలా ర్యాలీలకు, రోడ్డు షోలకు అనుమతి ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. వాళ్లు నో చెప్పింది సాధారణ వ్యక్తులకు కాదు. ఒకరు ప్రధాని నరేంద్ర మోదీ అయితే... మరొకరు కాంగ్రెస్ కాబోయే అధ్యక్షుడు రాహుల్ గాంధీ. గుజరాత్ రెండో దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ ఇద్దరూ ప్రచారం చివరి రోజయిన మంగళవారం అహ్మదాబాద్‌లో రోడ్డు షో నిర్వహించాలని భావించారు. అయితే ఈ మేరకు బీజేపీ, కాంగ్రెస్ అనుమతి కోరినా.. అహ్మదాబాద్ పోలీసులు నో చెప్పారు. శాంతిభద్రతలతోపాటు ట్రాఫిక్, ప్రజలకు అసౌకర్యం కారణాలుగా చెప్పడం గమనార్హం. రెండు పార్టీలకు నో చెప్పినట్లు అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ ఏకే సింగ్ వెల్లడించారు. ఈ నెల 14న గుజరాత్‌లో మిగిలిపోయిన 93 స్థానాలకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నెల 9న సౌరాష్ట్రతోపాటు దక్షిణ గుజరాత్‌లలోని 9 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. రెండో దశ ఎన్నికల కోసం ప్రధాని మోదీ సోమవారం మూడు ర్యాలీల్లో, రాహుల్ గాంధీ నాలుగు ర్యాలీల్లో పాల్గొననున్నారు. మరోవైపు పటీదార్ ఉద్యమనేత హార్దిక్ పటేల్ ఇవాళ అహ్మదాబాద్‌లో రోడ్ షో నిర్వహించనుండటం గమనార్హం.
× RELATED టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వంగానే ఉంటది..