నాలుగో సంతానం వద్దని భార్యను హత్య చేసిన భర్త

లక్నో : ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు.. మళ్లీ ఆడపిల్ల పుడితే పరిస్థితి ఏంటని భార్యతో భర్త గొడవ పడ్డాడు. నాలుగో సంతానం వద్దని.. గర్భాన్ని తొలగించుకోవాలని భార్యను డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సహనం కోల్పోయిన భర్త మృగంలా ప్రవర్తించి.. కత్తితో గర్భిణిని పొడిచి చంపాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఆగస్టు 19న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. బీహార్‌లోని దర్బాంగాకు చెందిన రాజీవ్ పొద్దార్(35), సంజన(30) బతుకుదెరువు కోసం ఘజియాబాద్‌లోని దుందహీర్ కొన్నేళ్ల క్రితం వచ్చారు. అక్కడే స్థిరపడ్డ రాజీవ్.. ఓ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. అయితే వీరికి ముగ్గురు ఆడపిల్లలు. వీరి వయసు ఆరు, నాలుగు, మూడు సంవత్సరాలు. సంజన మళ్లీ ఇప్పుడు గర్భవతి. ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. నాలుగో సంతానం కూడా ఆడపిల్ల అయితే తన పరిస్థితి ఏంటని రాజీవ్ సంజనతో వాదించాడు. గర్భాన్ని తొలగించుకోవాలని డిమాండ్ చేశాడు. దీంతో ఆగస్టు 19న రాత్రి భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కోపంతో ఊగిపోయిన భర్త.. ఇంట్లో ఉన్న కత్తితో గర్భవతిపై నాలుగు సార్లు పొడిచి చంపాడు. ఆ తర్వాత గోనె సంచిలో మృతదేహాన్ని నొక్కి.. తన బైక్‌పై డెడ్ బాడీని తీసుకెళ్లి సమీపంలోని మురికి కాల్వలో పడేశాడు. ఏమీ తెలియనట్లు తన భార్య అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మొత్తానికి సంజన కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టగా తానే తన భార్యను హత్య చేసినట్లుగా రాజీవ్ నేరాన్ని అంగీకరించాడు. నిందితుడు రాజీవ్‌ను ఆగస్టు 25న అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.

Related Stories: