పాక్‌కు ఆఫ్ఘన్ ఝలక్

బ్రిస్టల్: వన్డే వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ అదరగొట్టింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో పాకిస్థాన్‌ను ఓడించి మిగిలిన జట్లకు హెచ్చరికలు పంపింది. శుక్రవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘన్ 3 వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తుచేసింది. మొదట పాకిస్థాన్ 47.5 ఓవర్లలో 262 పరుగులకు ఆలౌటైంది. ప్రాక్టీస్ మ్యాచ్ కావడంతో బౌలర్లను కాకుండా మొత్తం 11 మంది బ్యాట్స్‌మెన్‌ను బరిలో దింపినా.. నిర్ణీత ఓవర్ల కంటే ముందే పాక్ ఆలౌట్ కావడం గమనార్హం. బాబర్ ఆజమ్ (108 బంతుల్లో 112; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ చేశాడు.లక్ష్య ఛేదనలో ఆఫ్ఘన్ 49.4 ఓవర్లలో 7 వికెట్లకు 263 పరుగులు చేసింది. హష్మతుల్లా షాహిది (74 నాటౌట్; 7 ఫోర్లు) చివరి వరకు నిలిచి జట్టుకు విజయాన్నందించాడు. మరో వార్మప్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 87 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది.