నవ్వించడమే ఎంటర్‌టైన్‌మెంట్ కాదు!

మీడియా లోని మంచిచెడులను వాస్తవిక కోణంలో చూపిస్తూ మనలో ఒకడు సినిమాను రూపొందించాం అని అన్నారు ఆర్.పి.పట్నాయక్. సంగీత దర్శకుడిగా కెరీర్‌ను ఆరంభించి ఆపై దర్శకుడిగా, కథానాయకుడిగా మారారాయన. సందేశాత్మక కథాంశంతో బ్రోకర్ సినిమాను తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలను అందుకున్నారు. ఆయన దర్శకత్వం వహిస్తూ హీరోగా నటించిన తాజా చిత్రం మనలో ఒకడు. ఈ నెల 4న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా మంగళవారం ఆర్.పి.పట్నాయక్ పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి... R.P.Patnayak ప్రస్తుతం మీడియా ధోరణులు ఎలా ఉంటున్నాయి? ప్రజలపై మీడియా ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తోంది? తాము చెప్పిందే వాస్తవమని నమ్మించడం కోసం మీడియా ఎలాంటి పద్ధతుల్ని అనుసరిస్తోంది? అనే అంశాలను ఆధారంగా చేసుకొని మనలో ఒకడు సినిమాను రూపొందించాం. యదార్థ సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కించిన చిత్రమిది. కృష్ణమూర్తి అనే సాధారణ అధ్యాపకుడి జీవితంలో మీడియా ఎలాంటి అలజడిని సృష్టించింది? ఆ అడ్డంకులను అతడు ఏ విధంగా అధిగమించాడు? అనేది ఆసక్తిని కలిగిస్తుంది. తాము నమ్మిందే కాకుండా జరిగిన యదార్థాలనే మీడియా అందరికి చూపించాలనే చక్కటి సందేశాన్ని అందిస్తున్నాం. కథలోని పాత్రలతో ప్రతి ఒక్కరూ సహానుభూతి చెందుతారు. పాత్రలతో కలిసి ప్రయాణం చేస్తారు. తమ కథ అనే భావనకు లోనవుతారు.

సెటైర్స్ ఉండవు

ప్రత్యేకంగా ఓ వ్యక్తినో, మీడియా సంస్థనో దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను రూపొందించలేదు. మీడియా సంస్థల తీరుతెన్నులను చర్చిస్తున్నాం. ఇందులో ఎలాంటి సెటైర్స్ ఉండవు. నేను చెప్పాలనుకున్న విషయాన్ని సీరియస్‌గా చూపించాను. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సమాజానికి అవసరమైన సినిమా ఇదని, నా కెరీర్‌లో గొప్ప సినిమాగా నిలుస్తుందని చెప్పారు. విజయంపై చాలా నమ్మకంతో ఉన్నాను.

హీరోయిజం ఉండదు

సాధారణ వ్యక్తి కథ ఇది. ఇలాంటి పాత్రలను స్టార్స్ చేస్తే హీరోయిజం ఎక్కువగా తెరపై కనిపిస్తుంది. ఈ పాత్రకు ఎవరూ న్యాయం చేయగలుగుతారు? అని ఆలోచిస్తే నా పేరే గుర్తుకొచ్చింది. నా కన్నా బెటర్ ఆర్టిస్ట్ అయితే కామన్‌మెన్ కన్నా ఎక్కువైపోతాడు అనే ఆలోచనతో నేనే నటించాను. నాకు నచ్చిన పాత్ర అయితేనే చేస్తాను. నేను కాకుండా మరో హీరో అయితే బాగుండు అనే పరిస్థితి ఇప్పటివరకూ రాలేదు.

అదే ఎంటర్‌టైన్‌మెంట్

ఒక ఎమోషన్‌ను మాత్రమే ఎంటర్‌టైన్‌మెంట్ అనడం సరికాదు. నవ్వించడమొక్కటే సినిమా ప్రధాన ధ్యేయమైతే సినిమాలో పాటలు, ఫైట్స్ ఉండక్కరలేదని నా అభిప్రాయం. ప్రేక్షకుడిని కథలో లీనమయ్యేలా చేయడమే నేను ఎంటర్‌టైన్‌మెంట్‌గా భావిస్తాను. ఈ సినిమాలో నవ్వించడంతో పాటు కన్నీళ్లు పెట్టించే భావోద్వేగాలు, ఆలోచనను రేకెత్తించే సంభాషణలు అన్ని అంశాలు మేళవించి ఉంటాయి.

సందేశం వుంటుంది

మెడికల్ మాఫియాపై ఓ సినిమాను తెరకెక్కించే ఆలోచనతో ఉన్నాను. వైద్యం పేరిట జరుగుతున్న మోసాలను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలనుకుంటున్నాను. భవిష్యత్తులో నేను చేయబోయే ప్రతి సినిమాలో సందేశం తప్పకుండా ఉండేలా చూసుకుంటాను. మరో మూడు కథలు సిద్ధంగా ఉన్నాయి. మనలో ఒకడు సినిమాను కన్నడంలో రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గాలి జనార్థన్‌రెడ్డి ఈ సినిమాను నిర్మించబోతున్నారు.
× RELATED నటుడిని కావడమే నా జీవితంలో పెద్ద షాక్!