ఉన్నత విద్యాభివృద్ధిలో పురోగతి

-ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పెరిగిన ప్రవేశాలు హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ఉన్నతవిద్యా వ్యవస్థ వేగంగా పురోగతి సాధిస్తున్నది. ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల కారణంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయి. కేంద్రంతో సంప్రదింపులు జరిపి డిగ్రీ కాలేజీల అభివృద్ధి కోసం రూ.100 కోట్లకుపైగా నిధులు సమీకరించింది. మరో రూ.100 కోట్లకుపైగా ఆర్‌ఐడీఎఫ్, స్టేట్ ప్లాన్ నుంచి నిధులను వెచ్చించింది. నాణ్యమైన విద్య, భవన నిర్మాణాలు, మౌలిక వసతులతోపాటు బాలికల సంరక్షణ కోసం వీటిని వెచ్చింది. నాలుగేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తొమ్మిది డిగ్రీ కాలేజీలను ఏర్పాటుచేసింది. మహిళల కోసం 30 గురుకుల డిగ్రీ కాలేజీలను ప్రారంభించింది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల అభివృద్ధి కోసం ఇప్పటివరకు ప్రభుత్వం రూ.500 కోట్లవరకు విడుదల చేసినట్టు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. ఫలితంగా 2018-19 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల సంఖ్య గణనీయంగా పెరిగింది. రాష్ట్రంలోని 1,041 డిగ్రీ కాలేజీల్లో మొత్తం 2.08 లక్షల సీట్లు నిండాయి. అందులో 199 ప్రభుత్వ, ఎయిడెడ్ డిగ్రీ, యూనివర్సిటీ కాలేజీల్లో 45 వేలకు పైగా సీట్లు నిండాయి. గత ఏడాదిలో ప్రవేశాలు 30 వేలు ఉండగా, ఈ ఏడాదిలో వాటిసంఖ్య 45 వేలకు చేరింది.

డ్రాప్ అవుట్స్ సమస్యకు పరిష్కారం రాష్ట్రంలో ఉన్నతవిద్యను అందిరికీ అందుబాటులోకి తీసుకెళ్లడంతోపాటు టెన్త్, ఇంటర్ పూర్తిచేసిన తర్వాత తలెత్తుతున్న డ్రాప్ అవుట్స్ సమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తున్నది. ఏయే వర్గాలవారు మధ్యలో చదువు మానేస్తున్నారో గుర్తించింది. వారికి మేలు చేసే ప్రయత్నాలు కొనసాగిస్తున్నది. ముఖ్యంగా బాలికల ఉన్నతాభివృద్ధి కోసం కొత్తగా 30 గురుకుల డిగ్రీ కాలేజీలను ఏర్పాటుచేసి, ఎస్సీ, ఎస్టీల బాలికలకు ప్రవేశాలు కల్పిస్తున్నది. బాలికల హాస్టళ్లలో సీసీ కెమెరాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని అమలుచేస్తున్నది. దోస్త్ ద్వారా ఆన్‌లైన్ ప్రవేశాలతో నకిలీ అడ్మిషన్లకు చెక్‌పెట్టింది.