‘గజ’ బాధితులకు 50 లక్షల విరాళమిచ్చిన సూర్య కుటుంబం

చెన్నై: గజ తుఫాను ప్రభావంతో తమిళనాడులో సుమారు ఏడు జిల్లాల్లో ప్రాణనష్టంతోపాటు పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం సంభవించింది. గజ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన వారికి అండగా నిలిచేందుకు ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. మరోవైపు తుఫాను బాధితులకు భరోసా కల్పించేందుకు స్వచ్చంద సంస్థలు, సినీ ప్రముఖులు, కార్పోరేట్ సంస్థలు ముందుకొస్తున్నాయి. గజ తుఫాను వల్ల నిరాశ్రయులైనవారికి తమ వంతు అండగా నిలిచేందుకు కోలీవుడ్ నటుడు సూర్య కుటుంబం ముందుకొచ్చింది.

బాధితుల పునరావాస కార్యక్రమాల కోసం సూర్య, జ్యోతిక దంపతులతోపాటు సూర్య తండ్రి శివకుమార్, తమ్ముడు కార్తీ కలిసి మొత్తం 50 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించి గొప్ప మనసు చాటుకున్నారు. ఈ విరాళం మొత్తాన్ని తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇవ్వనున్నారు. కేరళలో భారీ వరదలు సంభవించిన సమయంలో కూడా సూర్య, కార్తీ వెంటనే స్పందించి విరాళాన్ని ప్రకటించి తమ వంతు సాయమందించారు. ఈ విషయాన్ని సూర్య స్నేహితుడు కర్పూర సుందర పాండియన్ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.

Related Stories: