ఆర్టీసీ పురోగతికి కార్యాచరణ

నష్టాలు అధిగమించేందుకు చర్యలు: సోమారపు హైదరాబాద్, నమస్తే తెలంగాణ: టీఎస్‌ఆర్టీసీ ఆర్థిక పురోగతిని సాధించేదిశలో పలు మార్గాలను అన్వేషించి వాటిని అమలుపరిచేందుకు తగిన కార్యాచరణ రూపొందిస్తున్నట్టు సంస్థ చైర్మన్ సోమారపు సత్యనారాయణ తెలిపారు. సోమవారం బస్‌భవన్‌లో సుదీర్ఘంగా జరిగిన అధ్యయన నిపుణుల కమిటీ సమావేశంలో పలు ఆర్థికాంశాలపై చర్చించారు. సంస్థ ఆర్థిక స్థితిగతులపై ఉన్నతాధికారులతో కమిటీ సభ్యులు సమాలోచనలు జరిపారు. సంస్థను నష్టాల నుంచి గట్టెక్కించడానికి ఉన్న అవకాశాలపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సోమారపు సత్యనారాయణ మాట్లాడుతూ ఆక్యుపెన్సీ రేషియోను మెరుగుపరుచుకొనేందుకు ప్రయాణికుల కోసం వివిధ స్కీంలను అందుబాటులోకి తెచ్చినట్టు చెప్పారు. బీఎంటీసీ మాజీ చైర్మన్ ఎం నాగరాజు మాట్లాడుతూ.. నగరంలో ప్రత్యేకంగా మహిళల కోసం సర్వీసులు నడిపితే బాగుంటుందని సూచించారు. సీఐఆర్టీ మాజీ ఫ్యాకల్టీ సీహెచ్ హన్మంతరావు మాట్లాడుతూ ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకోవడానికి ప్రస్తుతం ఉన్న విధానాన్ని సరళతరం చేయాలని సూచించారు. అడ్వాన్స్ టికెట్ బుకింగ్ చేసుకొనే ప్రయాణికులకు 5 నుంచి 10 శాతం డిస్కౌంట్ ఇవ్వాలని సీఐఆర్టీ మాజీ సంచాలకుడు సుదర్శన పాదం సూచించారు.