ఏసీబీ వలలో పశు సంవర్ధకశాఖ అధికారి

మంచిర్యాల : మంచిర్యాల జిల్లా పశు సంవర్ధక శాఖ, పశు వైద్యాధికారి ఎల్లన్న ఓ కాంట్రాక్టర్ వద్ద లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన మొయినొద్దీన్‌కు వివిధ ప్రాంతాల నుంచి గొర్రెలను సరఫరా చేసేందుకు టెండర్‌ను ప్రభుత్వం నుంచి పొందారు. గొర్రెలను సరఫరాకు సంబంధించిన రూ. 43 లక్షల బిల్లు మంజూరు కాగా దాన్ని కాంట్రాక్టర్‌కు ఇచ్చేందుకు జేడీ రూ. లక్ష డిమాండ్ చేశారు. గత నెల 20న మొయినొద్దీన్ మేనేజర్ వెంకటేశ్వర్లు రూ. 50 వేలు జేడీకి లంచంగా ఇచ్చారు. మరో 50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయగా వెంకటేశ్వర్లు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో రూ. 50 వేలను సోమవారం ఇచ్చేందుకు అంగీకారం కుదర్చుకున్నారు. దీంతో కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ కిరణ్‌కుమార్, ఆదిలాబాద్ డీఎస్పీ ప్రతాప్ వలపన్ని తన కార్యాలయంలో లంచం ఇచ్చే సమయంలో జేడీ ఎల్లన్నను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు పంచనామా నిర్వహించి ఎల్లన్నను కరీంనగర్ ఏసీబీ కోర్టుకు తరలించారు.

Related Stories: