కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్రధాన కోచ్ ఎవరంటే..?

కోల్‌కతా: వచ్చే ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్ కోసం ఆయా ఫ్రాంఛైజీలు ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తున్నాయి. తాజాగా రెండుసార్లు ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రాంఛైజీ వినూత్న ఆలోచనతో కేకేఆర్ అకాడమీని ప్రారంభించింది. ఐపీఎల్ సీజన్ ముగిసిన తరువాత మిగతా 10 నెలల పాటు ఆ ఫ్రాంఛైజీ ఆటగాళ్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడమే ఈ అకాడమీ ముఖ్య ఉద్దేశం. దీనిలో భాగంగానే అకాడమీ ప్రధాన కోచ్‌గా ముంబయి ఆల్‌రౌండర్ అభిషేక్ నాయర్‌ను నియమించారు. 2018 ఐపీఎల్ సీజన్‌లో కేకేఆర్ జట్టుకు సపోర్ట్ స్టాఫ్‌గా పనిచేశారు. శిక్షణా సౌకర్యాలు, కోచింగ్ అందించే అకాడమీ వివరాలతో పాటు కోచ్ ఎవరనే విషయాన్ని కేకేఆర్ సీఈవో, ఎండీ వెంకీ మైసూర్ వెల్లడించారు. అకాడమీ బౌలింగ్ కోచ్‌గా ఓంకార్ సాల్వీ, వీడియో అనలిస్ట్ ఏఆర్ శ్రీకాంత్ కూడా రెండు వారాల క్యాంపులో పాల్గొంటారని చెప్పారు. తొలి క్యాంపు బెంగళూరు వేదికగా దాదాపు రెండు వారాల పాటు జరగనుంది. రింకూ సింగ్, అపూర్వ్ వాంఖడే, నితీష్ రాణా,శుభ్‌మన్ గిల్‌తో పాటు మరో ఐదుగురు క్రికెటర్లు ఈ ప్రత్యేక శిక్షణలో పాల్గొంటారు.
× RELATED టీఆర్‌ఎస్ అందరి పార్టీ..: మంత్రి కేటీఆర్