ఎనిమిది నిమిషాల్లోనే కారు చార్జ్

న్యూఢిల్లీ: విద్యుత్ పరికరాల తయారీలో అగ్రగామి సంస్థ ఏబీబీ..గ్లోబల్ మొబిలిటీ సమ్మిట్‌లో అత్యంత వేగవంతమైన చార్జింగ్ సిస్టాన్ని ఆవిష్కరించింది. కేవలం ఎనిమిది నిమిషాల్లో విద్యుత్ బ్యాటరీ చార్జింగ్‌తో 200 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చును. భారత్‌లో తొలిసారిగా ఏబీబీ టెర్రా హెచ్‌పీ అత్యంత వేగవంతమైన చార్జింగ్ సిస్టాన్ని ఆవిష్కరించిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. జాతీయ రహదారుల్లో ఉన్న రెస్ట్ స్టాప్స్, పెట్రోల్ బంకుల్లో సులువుగా బిగించుకోవడానికి వీలుగా ఈ చార్జింగ్ స్టేషన్లను రూపొందించింది. ఈ సందర్భంగా ఏబీబీ సీఈవో ఉల్రిచ్ స్పిస్స్‌హోఫర్ మాట్లాడుతూ..ప్రజా రవాణా వ్యవస్థలో ఈ-మొబిలిటీ సిస్టాన్ని ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచనకు అనుగుణంగా ఈ స్టేషన్లను రూపొందించినట్లు చెప్పారు. కేంద్రం ప్రవేశపెట్టిన మేక్ ఇన్ ఇండియా పథకంలో భాగంగా పారిశ్రామిక ప్రగతి పథంలో దూసుకుపోవడానికి తమవంతుగా కృషి చేస్తున్నట్లు, దీంతో స్మార్ట్‌గా కాలుష్యాన్ని నియంత్రించే వీలుంటుందన్నారు. కేంద్రం, నీతి ఆయోగ్, వినియోగదారులు, టెక్నికల్ ఇనిస్టిట్యూట్‌లతో కలిసి భారత వృద్ధికి ఏబీబీ తనవంతు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే సంస్థ 68 దేశాల్లో 8 వేల స్టేషన్లను నెలకొల్పింది.
× RELATED రేపు నగరంలో ట్రాఫిక్ అంక్షలు..