గల్ఫ్ బాధితుల సహాయార్థం యూఏఈకి బృందం

-ఆమ్నెస్టీతో విముక్తి పొందినవారిని తీసుకొచ్చేందుకు కృషి: మంత్రి కేటీఆర్ హామీ -పలువురి ఖర్చుభరించిన ఎన్నారైశాఖకు ప్రశంసలు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: యూఏఈ ప్రభుత్వం కల్పించిన క్షమాభిక్ష (ఆమ్నెస్టీ) కారణంగా విముక్తి పొందినవారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు త్వరలో ఓ బృందాన్ని అక్కడికి పంపిస్తామని ఐటీ, ఎన్నారై వ్యవహారాలశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు హామీ ఇచ్చారు. గల్ఫ్ బాధితులకు టీఆర్‌ఎస్ ఎన్నారైశాఖ సహాయం చేసేందుకు ముందుకురావడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ ఎన్నారై విభా గం కోఆర్డినేటర్ మహేశ్ బిగాల ఆదివారం హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఆమ్నెస్టీ కారణంగా విముక్తిపొందిన 11 మందికి మానవతా దృక్పథంతో టీఆర్‌ఎస్ ఎన్నారైశాఖ తరఫున విమాన టికెట్లు కొనిచ్చి తెలంగాణకు తీసుకొస్తున్నామని మహేశ్ వివరించారు. మరింతమందికి ఇదే తరహాలో ఇబ్బందులున్నాయని పేర్కొన్నారు. దీనికి స్పందించిన మంత్రి.. ప్రత్యేక బృం దాన్ని పంపించి మిగతావారిని రప్పిస్తామని హామీఇచ్చారు. రైతుబంధు చెక్కులను ఎన్నారైల బంధువులకు ఇచ్చేందుకు ప్రభుత్వం సడలింపునివ్వడం అభినందనీయమని పేర్కొన్న మహేశ్.. ఎన్నారైల తరఫున మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.