రుణాల పేరుతో బ్యాంకులకు టోకరా.. నిందితుడు అరెస్ట్

హైదరాబాద్ : బ్యాంకులను మోసం చేసి రుణాలు పొందిన వ్యక్తిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓల్డ్‌బాలాపూర్‌కు చెందిన కొండా సురేశ్ నాగోల్‌లో తనకు ఉన్న 30 గుంటల స్థాలాన్ని 10 ప్లాట్లుగా చేసి 2001లో విక్రయించాడు. ఆ తరువాత 2008లో అదే స్థలాన్ని తిరిగి చదును చేసి, వాటిని తిరిగి 9 ప్లాట్లుగా చేసి 9 మంది ప్రభుత్వ ఉద్యోగులకు అమ్మాడు. అయితే వారికి లోన్లు ఇప్పిస్తానంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్‌లో ఖాతాలు తెరిపించి, ఒక్కొక్కరికి రూ. 10 లక్షల చొప్పున రూ. 90 లక్షల రుణం ఇప్పించాడు. ఇదే స్థలాన్ని బీవీ ప్రసాద్‌రావు అనే వ్యక్తి ద్వారా 2010లో మరికొంతమందికి విక్రయించి, శ్రీరామ్ ఫైనాన్స్ సంస్థలో రుణం పొందాడు. ఇదిలా ఉండగా... స్టేట్ బ్యాంకు ఆఫ్ బికనీర్ బ్రాంచ్‌లకు కొన్నాళ్లు తానే స్వయంగా వాయిదాలు చెల్లించి, ఆ తరువాత రుణం చెల్లించడం మానేశాడు. దీంతో బ్యాంకు అధికారులకు అనుమానం వచ్చి ఆరా తీయగా, ఉద్యోగుల పేరుతో రుణం మాత్రమే పొందాడని, ఆ ప్లాట్లను మరొకరికి విక్రయించి మరో చోట రుణం పొందిన ట్లు బ్యాంకు అధికారులు గుర్తించి సీసీఎస్ పోలీసులకు ఫిర్యా దు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ప్రభుత్వ ఉద్యోగులుగా చెప్పి రుణాలు ఇప్పించడంతో అప్పట్లో బ్యాంకు మేనేజర్‌గా పనిచేసిన అధికారి పాత్ర ఉండవచ్చని సీసీఎస్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో బ్యాంకులను మోసం చేసిన సురేశ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు, ఈ స్కాంలో ఎవరెవరున్నారని ఆరా తీస్తున్నారు.
More in తాజా వార్తలు :