20 వేల కోసం బాలుడి కిడ్నాప్

హైదరాబాద్ : రూ.20 వేల కోసం బాలుడిని అపహరించిన ఆటో డ్రైవర్, అతన్ని ప్రోత్సహించిన మరో వ్యక్తిని చాదర్‌ఘాట్ పోలీసులు అరెస్ట్‌చేశారు. బాలుడిని అతని తల్లికి అప్పగించారు. ఎస్‌హెచ్‌ఓ రమేశ్ కథనం ప్రకారం... మలక్‌పేట మహబూబ్ మాన్షన్ ఎదుట ఫుట్‌పాత్‌పై ఉల్లిపాయలు విక్రయించే మౌనిక సోమవారం రాత్రి తన కొడుకు సల్మాన్‌ను పక్కలో పెట్టుకుని నిద్రపోయింది. కాగా, కొద్దిసేపటి తరువాత గుర్తు తెలియని వ్యక్తులు బాలుడిని అపహరించుకుపోయారు. గమనించిన తల్లి మంగళవారం చాదర్‌ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదే ఫుట్‌పాత్‌పై పడుకున్నవారు బాలుడిని ఎత్తుకుపోయింది ఆటో డ్రైవర్ సురేశ్ గా గుర్తించి పోలీసులకు తెలిపారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడు సురేశ్ పాతమలక్‌పేట అయోధ్యానగర్‌కు చెందినవాడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో... అదే ప్రాంతానికి చెందిన ఎం.రాజ్‌కుమార్... తనకు ఓ బాలుడిని తీసుకొచ్చి ఇవ్వాలని, ఇందుకు రూ.20 వేలు ఇస్తానని చెప్పినట్లు సురేశ్‌కు చెప్పాడు. నిందితుడు సురేశ్, బాలుడిని తీసుకురమ్మన్న రాజ్‌కుమార్‌లను అరెస్ట్ చేశారు. బాలుడిని తల్లికి అప్పగించారు.
× RELATED ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతం