13 నెలల్లో 79 లక్షల ఉద్యోగాలు

సెప్టెంబర్‌లోనే దాదాపు 10 లక్షలు: ఈపీఎఫ్‌వో న్యూఢిల్లీ, నవంబర్ 20: ఈ ఏడాది సెప్టెంబర్‌లో 9.73 లక్షల ఉద్యోగాల సృష్టి జరిగిందని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) తెలియజేసింది. గతేడాది సెప్టెంబర్‌లో 4.11 లక్షలేనన్న ఈపీఎఫ్‌వో.. నిరుడు సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు దాదాపు 79.48 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయని వెల్లడించింది. ఈ మేరకు పేరోల్ డేటాను మంగళవారం ఈపీఎఫ్‌వో విడుదల చేసింది. ఈ 13 నెలల్లో ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే అత్యంత ఎక్కువ ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయన్న ఉద్యోగ భవిష్య నిధి.. మార్చిలో అతి తక్కువగా 2.36 లక్షల ఉద్యోగాలు ఏర్పడ్డాయని చెప్పింది. కాగా, ఈ సెప్టెంబర్ ఉద్యోగాల్లో 2.69 లక్షల మేర 18 నుంచి 21 ఏండ్ల మధ్య వయస్కులే దక్కించుకున్నట్లు ఈపీఎఫ్‌వో స్పష్టం చేసింది. 22-25 ఏండ్ల వయసు వారికి 2.67 లక్షల ఉద్యోగాలు వచ్చినట్లు వివరించింది. ఈపీఎఫ్‌వోలో దేశవ్యాప్తంగా 6 కోట్ల మందికిపైగా ఉద్యోగులకు సభ్యత్వం ఉన్నది.