2657 కిలోల ఉల్లిగడ్డ అమ్మితే రూ.6 లాభం

ముంబై: మహారాష్ట్ర ఉల్లిగడ్డ రైతుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ధరలు ఘోరంగా పతనమయ్యాయి. తాజాగా అహ్మద్‌నగర్ జిల్లాకు చెందిన ఓ రైతు తన దగ్గరున్న 2657 కిలోల ఉల్లిగడ్డను అమ్మితే వచ్చిన రూ.6 లాభాన్ని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు పంపించి నిరసన తెలిపాడు. ఉల్లిగడ్డ ధర హోల్‌సేల్‌లో కిలోకు కేవలం రూపాయి మాత్రమే. దీంతో తన దగ్గర ఉన్న పంటను అమ్మి, మార్కెట్ ఖర్చులన్నీ భరించగా మిగిలింది కేవలం రూ.6 అని రైతు శ్రేయస్ అభాలె చెప్పాడు. 2657 కిలోల ఉల్లిగడ్డ మార్కెట్‌కు తీసుకొస్తే.. నాకు రూ.2916 వచ్చాయి. అందులో కూలీలకు, రవాణా చార్జీలకు రూ.2910 ఖర్చయ్యాయి. మిగిలింది రూ.6 మాత్రమే అని అతడు తెలిపాడు. తన దుస్థితిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడానికి ఆ మిగిలిన డబ్బును ఆయనకు పంపినట్లు అభాలె చెప్పాడు. పంట కోసం రెండు లక్షలు ఖర్చు పెట్టాను. వచ్చినవి మాత్రం 6 రూపాయలు. మిగతా ఖర్చులను ఎలా చెల్లించాలో అర్థం కావడం లేదు అని అతను వాపోయాడు. ఈ నెల 7న మనీ ఆర్డర్ ద్వారా సీఎంకు ఆ డబ్బు పంపినట్లు చెప్పాడు. నాసిక్, అహ్మద్‌నగర్ జిల్లాల్లో భారీగా పంట రావడం వల్ల ఉల్లిగడ్డ ధరలు దారుణంగా పతనమయ్యాయి.

Related Stories: