పోకిరీలపై 15 రోజుల్లో.. 71 ఫిర్యాదులు

హైదరాబాద్ : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆగస్టు 15 నుంచి 31 వరకు 15 రోజుల్లో పోకిరీలపై 71 ఫిర్యాదులు అందాయి... వీటిపై ప్రాథమిక దర్యాప్తు చేసిన షీ టీమ్స్ 12 క్రిమినల్ కేసులు, 24 పెట్టీ కేసులను నమోదు చేశారు. పోకిరీల ఆగడాలను అరికట్టేందుకు మొత్తం 15 రోజుల్లో షీ టీమ్స్ దాదాపు 103 డెకాయ్ ఆపరేషన్‌లను నిర్వహించారు. 23 అవగాహన కార్యక్రమాలను నిర్వహించి, 14 వేల మంది మహిళలు, యువతులు, విద్యార్థినులకు హక్కులు, చట్టాలు, చిట్కాలను వివరించారు. 15 రోజుల్లో పట్టుబడ్డ వారిలో 24 మందికి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. పట్టుబడిన వారిలో నలుగురు మైనర్లు కూడా ఉన్నారు. షీ టీమ్స్ అరెస్టు చేసిన పలు కేసుల్లో ముఖ్యమైనవి ఇలా ఉన్నాయి... నల్లా రిపేరు కోసం వచ్చి... కూకట్‌పల్లి ఆల్విన్‌కాలనీకి చెందిన ఓ మహిళ... తమ ఇంట్లో నల్లాలు సరిగ్గా పని చేయడం లేదని స్థానిక హార్డ్‌వేర్ షాపు నుంచి ఓ ప్లంబర్ ను పంపించమని కోరింది. నల్లాలు రిపేరు కోసం వచ్చిన అతను ... ఆ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె షీ టీమ్స్‌కు ఫిర్యాదు ఇవ్వడంతో అతన్ని అరెస్టు చేశారు. డెవిల్ మాట్లాడుతున్నానంటూ వేధింపులు కేపీహెచ్‌బీ ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థినికి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి... తన పేరు డెవిల్(దెయ్యం)గా పరిచయం చేసుకుని ప్రేమించమని వేధిస్తున్నాడు. ఈ సంఘటనతో యువతి తీవ్ర భయాందోళనకు గురై మానసికంగా కలవరానికి గురైంది. యువతి తండ్రి షీ టీమ్స్ కు ఫిర్యాదు చేయడంతో యువకుడిని అరెస్టు చేశారు. ఇంటర్వ్యూలో పరిచయం..డేటింగ్ సైట్‌లో ఫోన్ నంబర్ మాదాపూర్ ప్రాంతానికి చెందిన యువతికి ఇటీవల ఓ ఇంటర్వ్యూకు వెళ్లినప్పుడు ఓ యువకుడు పరిచయమయ్యాడు. ఈ పరిచయం స్నేహంగా మారడంతో... యువకుడు ఆమెకు ప్రేమ ప్రతిపాదనను చేశాడు. ఇటీవల ఫోన్‌లు, మెసేజ్‌లు పంపిస్తూ వేధిస్తున్నాడు. అంతే కాకుండా ఆమె ఫోన్ నంబర్‌ను డేటింగ్ యాప్‌ల్లో పెట్టి మానసికంగా హింసిస్తున్నాడు. యువతి ఫిర్యాదుతో షీ టీమ్స్ అతన్ని అరెస్టు చేసింది. మహిళలు, యువతులు, విద్యార్థినులు తమ పై జరిగే అఘాత్యాలు, వేధింపులపై మౌనంగా ఉండకుండా సైబరాబాద్ షీ టీమ్స్ వాట్సాప్ నంబర్ 9490617444 లేదా డయల్ 100 లేదా sheteam.cyberabad@gmail.com, twitter@cyberabadpolice లో సంప్రదించవచ్చని సైబరాబాద్ షీటీమ్స్ డీసీపీ అనసూయ తెలిపారు. బాధితుల వివరాలు గోప్యంగా ఉంటాయని ఆమె స్పష్టం చేశారు.
× RELATED బాలిక కిడ్నాప్..24 గంటల్లోనే కాపాడారు