అమెరికన్లను ముంచిన భారతీయ కాల్‌సెంటర్లు

-2012-16 మధ్య 55 లక్షల డాలర్లు స్వాహా -కుంభకోణంలో ఏడుగురు భారతీయులు, 5 బీపీవో సెంటర్ల పాత్ర -నిందితుల అరెస్ట్ .. కోర్టులో అభియోగాలు నమోదు
షికాగో/ అహ్మదాబాద్/ భోపాల్: అమెరికన్లను భారతీయ కాల్‌సెంటర్లు దారుణంగా మోసగించాయి. ఏడుగురు భారతీయులు సహా 15 మంది, ఐదు భారతీయ కాల్ సెంటర్లు ఇందులో పాలుపంచుకున్నాయి. 2000 మందికి పైగా అమెరికన్లను మోసగించి రూ.39.65 కోట్ల (55 లక్షల డాలర్లు) మేరకు దోచుకున్నాయని అమెరికా న్యాయశాఖ శుక్రవారం తెలిపింది. కాల్ సెంటర్ల ఆపరేటర్లు.. అమెరికా ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్‌ఎస్) అధికారులుగా నటి స్తూ రుణాలు ఇస్తామని బురిడీ కొట్టించాయని అటార్నీ బ్యుంగ్ జే పాక్ చెప్పారు. పన్నులు గానీ, పెనాల్టీలుగానీ ప్రభుత్వానికి చెల్లించకుంటే అరెస్ట్ చేసి జైలులో పెడతారని బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. బాధితుల్లో వలస ప్రజలు, సీనియర్ సిటిజన్లు కూడా ఉండటం గమనార్హం. ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న ఏడుగురు వ్యక్తులను గురువారం అమెరికాలో అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ కుంభకోణం 2012-16 మధ్య సాగింది. ఐఆర్‌ఎస్, పేడే లోన్ ఫోన్ స్కీమ్‌ల పేరిట అమెరికన్లను దోచుకున్నారు అని బ్యుంగ్ జే పాక్ ఆరోపించారు. దీని వెనుక సూత్రధారులను గుర్తించి ప్రాసిక్యూట్ చేయడానికి కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. ఈకేసు దర్యాప్తు బృందాన్ని అభినందిస్తున్నానని అమెరికా పన్నులశాఖ ఐజీ జే రస్సెల్ జార్జి తెలిపారు. కాల్ సెంటర్ల బెదిరింపులతో బాధితులు మనీగ్రామ్, వెస్ట్రన్ యూనియన్ తదితర సంస్థల ద్వారా నగదు బదిలీ చేశారని తేలింది.

Related Stories: