మాన‌సిక ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గి ప్ర‌శాంతంగా ఉండాలా..? ఇలా చేయండి..!

నేటి ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో ఎవరినీ చూసినా నిత్యం అనేక సవాళ్లను ఎదుర్కొంటూ అనేక సంద‌ర్భాల్లో తీవ్ర‌ ఒత్తిడికి లోనవుతున్నారు. దీంతో ఇది కేవలం మానసిక ఆరోగ్యమే కాకుండా శారీరక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతోంది. అది క్ర‌మంగా తీవ్ర మాన‌సిక స‌మ‌స్య‌, డిప్రెష‌న్‌ల‌కు దారి తీస్తున్న‌ది. త‌రువాత ఎలాంటి ప‌రిణామాలు సంభ‌విస్తున్నాయో అంద‌రికీ తెలిసిందే. అయితే కింద ఇచ్చిన పలు సూచనలు పాటిస్తే నిత్యం ఎదురయ్యే ఒత్తిడి, ఆందోళ‌న‌ల‌ను సులభంగా త‌గ్గించుకోవ‌చ్చు. మ‌రి ఆ సూచ‌న‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. నిత్యం వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. కష్టతరమైన ఎక్సర్‌సైజ్‌లు చేయకున్నా కనీసం ఒక అరగంట పాటు వాకింగ్ చేసినా చాలు. దీంతో శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. అంతేకాదు ఇది బరువు తగ్గడం కోసం, మానసిక ఉల్లాసం కోసం కూడా ఉపయోగపడుతుంది. 2. ఫాస్ట్‌ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారం, చక్కెరలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినకూడదు. ఇవి మెదడులో ఒత్తిడిని కలగజేసే కెమికల్స్‌పై ఏమాత్రం ప్రభావం చూపవు. ఈ క్రమంలో సరైన విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలు కలిగిన ఆహారాన్ని నిత్యం తగిన మోతాదులో సరైన వేళకు తీసుకోవాలి. దీని వల్ల కూడా మనకు కలిగే ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. 3. నిత్యం పని ఒత్తిడితో బిజీగా ఉన్నా ఏదో ఒక సమయంలో వినోదం అందేలా చూసుకోవాలి. దీంతో ఒత్తిడి కొంత మేర తగ్గేందుకు అవకాశం ఉంటుంది. అందరితో ఫన్నీగా మాట్లాడడం, జోక్స్ వినడం వంటివి చేస్తే ఒత్తిడి దూరమవుతుంది. 4. ఒత్తిడి అధికంగా ఉన్నట్టు భావిస్తే చేసే పనినంతా పక్కన పెట్టి కొన్ని నిమిషాల పాటు కళ్లు మూసుకుని గట్టిగా శ్వాస తీసుకోండి. గాలి పీల్చేటప్పుడు, వదిలేటప్పుడు శ్వాసను గమనించండి. దీంతో ఒత్తిడి కొద్దిగా తగ్గుతుంది. 5. ఆరోగ్యవంతమైన వ్యక్తులు రోజుకు కనీసం 6 నుంచి 8 గంటల పాటు తప్పనిసరిగా నిద్రపోవాలి. లేదంటే ఒత్తిడిని కలిగించే హార్మోన్లు వివిధ రసాయనాలను ఎక్కువగా విడుదల చేస్తాయి. దీంతో ఒత్తిడి, ఆందోళ‌న పెరుగుతాయి. క‌నుక వీటిని త‌గ్గించుకోవాలంటే నిత్యం త‌గినంత స‌మ‌యం పాటు నిద్ర‌పోవ‌డం త‌ప్ప‌నిస‌రి. 6. రోజూ తగినంత నీటిని తాగాలి. కనీసం 2 లీటర్ల వరకు నీటిని రోజులో అప్పుడప్పుడైనా తాగితే అది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. దీంతోపాటు ఒత్తిడి కూడా తగ్గుతుంది.
× RELATED టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వంగానే ఉంటది..