గ్రామీణ బ్యాంకుల స్థిరీకరణ

- 56 నుంచి 36కి కుదించనున్న కేంద్రం న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: మొన్నటికి మొన్న మూడు బ్యాంకులను విలీనం చేయనున్నట్లు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం..తాజాగా గ్రామీణ బ్యాంకులపై దృష్టి సారించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న 56 రూరల్ బ్యాంకులను 36కి తగ్గించేక్రమంలో భాగంగా మరోసారి విలీనానికి తెరలేపింది కేంద్రం. ఇందుకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్రం చర్చలు ప్రారంభించిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. కేంద్ర ప్రకటనకు అనుగుణంగా ఇప్పటికే గ్రామీణ బ్యాంకులను ప్రమోటింగ్ చేస్తున్న ప్రధాన బ్యాంకులు ప్రత్యేక రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసుకున్నాయని ఆయన చెప్పారు. ఈ నెల మొదట్లో బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయా బ్యాంక్, దేనా బ్యాంకులను విలీనం చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం 56గా ఉన్న ఆర్‌ఆర్‌బీలను 36లకు కుదించడం ద్వారా పనితీరు మెరుగుపరుచడంతోపాటు అధిక ఉత్పాదకత, ఆయా బ్యాంకులను ఆర్థికంగా బలోపేతం చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో విస్తారంగా సేవలు అందించడానికి వీలు పడుతుందన్నారు. చిన్న స్థాయి రైతులు, వ్యవసాయ కూలీలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కళాకారులను ఆర్థికంగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 1976లో ఆర్‌ఆర్‌బీలకు అంకురార్పణ జరిగింది. అలా ఏర్పడిన బ్యాంకులు..కేంద్ర, రాష్ట్ర, స్పాన్సర్ బ్యాంకుల నుంచి మాత్రమే నిధులను సేకరించే అవకాశం మాత్రమే ఉన్నది.

ప్రస్తుతం ఆర్‌ఆర్‌బీల్లో కేంద్రానికి 50 శాతం వాటా ఉండగా, ప్రమోట్ చేస్తున్న బ్యాంకులకు 35 శాతం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు 15 శాతం వాటా ఉన్నది. ఆర్‌ఆర్‌బీ చట్టానికి లోబడి ఆయా సంస్థల్లో వాటా విక్రయానికి సంబంధించి కేంద్రం, ప్రమోట్ చేస్తున్న బ్యాంకుల సంయుక్తంగా 51 శాతం కంటే తగ్గకుండా పరిమితి విధించారు. మార్చి 2005లో 196గా ఉన్న ఆర్‌ఆర్‌బీలు ఆ తర్వాతి ఏడాదినాటికి 133కి తగ్గాయి. ఆ తర్వాతి క్రమంలో 105కి తగ్గిన బ్యాంకులు మార్చి 2012 నాటికి 82కి కుదించింది కేంద్ర ప్రభుత్వం. మరోదఫా విలీనం చేయడంతో ప్రస్తుతం సంఖ్య 56కి చేరాయి. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 21,200 శాఖలు కలిగివున్న ఆర్‌ఆర్‌బీల నికర లాభం ఏడాది ప్రాతిపదికన 17 శాతం పెరిగి రూ.2,950 కోట్లకు చేరుకున్నాయి. రుణ వితరణ విషయానికి వస్తే 15 శాతం పెరిగి రూ.3.5 లక్షల కోట్లకు చేరాయి.