చర్మ సౌందర్యాన్ని పెంచే ఎఫెక్టివ్ చిట్కాలు..!

మహిళలు తమ చర్మ సౌందర్యాన్ని మెరుగు పరుచుకునేందుకు, చర్మం కాంతివంతంగా, మృదువుగా కనిపించేందుకు అనేక రకాల క్రీములు, పౌడర్లు, సబ్బులు వాడుతూనే ఉంటారు. అయితే అవి అందరికీ పడవు. రసాయనాలతో తయారు చేసినందున వాటిని వాడితే చర్మానికి మేలు జరగకపోగా కొన్ని సార్లు చర్మం వాపులకు లోనై దద్దుర్లు, దురదలు వచ్చి, ఇన్‌ఫెక్షన్ బారిన పడేందుకు అవకాశం ఉంటుంది. కనుక ఆ ఇబ్బందులు పడకుండా సహజ సిద్ధమైన పద్ధతిలోనే చర్మ సౌందర్యాన్ని పొందాలంటే అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. మంచి గంధం చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. కొద్దిగా గంధం పొడి తీసుకుని అందులో కొన్ని చుక్కల నిమ్మరసం, కీరదోస రసం, టమాటా రసం కలిపి దాన్ని పేస్ట్‌లా చేసి ముఖానికి రాయాలి. బాగా ఎండిపోయే దాకా వేచి ఉండి అనంతరం గోరు వెచ్చని నీటితో ముఖాన్ని కడగాలి. ఇలా తరచూ చేస్తే ముఖం కాంతిని పొందుతుంది.

2. పాలపొడి, నిమ్మరసం, తేనెలను ఒక్కొక్కటి 15 ఎంఎల్ చొప్పున తీసుకుని ఒక పాత్రలో వాటిని వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమానికి అర టేబుల్ స్పూన్ బాదం నూనె కలిపి పేస్టులా చేసి ముఖానికి పట్టించాలి. 10 నిమిషాల పాటు ఆగాక చల్లని నీటితో ముఖాన్ని కడగాలి. ఇలా చేయడం వల్ల ముఖం కాంతిని పొంది చర్మం మృదువుగా మారుతుంది.

3. నాలుగు లేదా ఐదు బాదం పప్పును రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే పప్పులపై ఉన్న పొట్టు తీసి వాటిని పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ పేస్ట్‌కు కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాయాలి. బాగా ఆరాక నీటితో కడగాలి. ఇలా తరచూ చేస్తే ముఖ సౌందర్యం పెరుగుతుంది.

4. పెరుగు, నారింజ రసం సమాన భాగాల్లో తీసుకుని బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. లేదా తేనె-నిమ్మరసం, కీరదోస-నిమ్మరసం కాంబినేషన్లను కూడా ట్రై చేయవచ్చు. వాటిని రాసి కొంత సేపు ఆగాక కడిగేయాలి. ఇలా తరచూ చేస్తే ముఖం కాంతిని సంతరించుకుంటుంది.

5. ఆలుగడ్డలను పొట్టు తీసి వాటిని జ్యూస్‌లా పట్టి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉండే మచ్చలు పోతాయి.

× RELATED నేహా ఇంట గారాలపట్టి సందడి