పోలీసులను కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో ముగ్గురు ఎస్పీవోలు, ఒక పోలీసును ఉగ్రవాదులు అపహరించారు. ఇవాళ తెల్లవారుజామున కప్రాన్ గ్రామంలోకి ప్రవేశించిన ఉగ్రవాదులు.. పోలీసుల నివాసాల్లోకి చొరబడి వారిని కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ అయిన పోలీసులను ఫిర్దోస్ అహ్మద్, కుల్దీప్ సింగ్, నిసార్ అహ్మద్ దోబీ, ఫయాజ్ అహ్మద్ భట్‌గా పోలీసు ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ నలుగురిని తమ ఉద్యోగాలకు రాజీనామా చేయాలని ఉగ్రవాదులు ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. పోలీసులను హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేయాలని మంగళవారం హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థకు చెందిన ఉగ్రవాదులు హెచ్చరించిన విషయం తెలిసిందే. పోలీసు ఉద్యోగాలకు రాజీనామా చేయకపోతే చంపేస్తామని హెచ్చరించారు. ఎస్పీవోలు, పోలీసు ఆచూకీ కోసం పోలీసు ఉన్నతాధికారులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

Related Stories: