క్యాన్సర్ చికిత్సకు 3సీ విధానం

హైదరాబాద్: క్యాన్సర్ కన్సల్టేషన్, నిర్ధారణ, చికిత్సావిధానంలో హైదరాబాద్‌లోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ 3సీ సమగ్ర క్యాన్సర్ కన్సల్టేషన్ పేరుతో వినూత్న విధానాన్ని రూపొందించింది. కాన్సర్ రోగుల ప్రాణాలను నిలబెట్టడంలో చికిత్సా విధానాన్ని త్వరగా నిర్ణయించడం కీలక పాత్ర పోషిస్తుంది. క్యాన్సర్ చికిత్సలో రేడియేషన్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, ఇమ్యూనో థెరపీ, టార్గెటెడ్ థెరపీ వంటి విధానాలు ఉన్నాయి. ఇందులో సరియైన విధానాన్ని ఎంచుకునే క్రమంలో కాలం వృథా అవుతున్నది. ఈ సమస్యకు 3సీ విధానం పరిష్కారం చూపుతుందని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ మెడికల్ డైరెక్టర్, కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బాబయ్య తెలిపారు. ఈ విధానంలో రేడియేషన్ ఆంకాలజిస్ట్, సర్జికల్ ఆంకాలజిస్ట్, మెడికల్ ఆంకాలజిస్ట్ ముగ్గురూ కలిసి క్యాన్సర్ పేషంట్‌ను పరీక్షిస్తారన్నారు. ఏ విధమైన క్యాన్సర్ సోకింది? ఏ దశలో ఉన్నది? వ్యాప్తి, రోగి వయసు, శారీరక స్థితి వంటి లక్షణాల ఆధారంగా తగిన చికిత్సా విధానాన్ని నిర్ణయిస్తారని చెప్పారు. దీంతో రోగికి త్వరగా, కచ్చితమైన వైద్యం అందుతుందన్నారు. ఈ విధానంతో రోగికి త్వరగా మెరుగైన వైద్యం అందించే వీలు కలుగుతుందని కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రవిచందర్, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సుధాసిన్హా తెలిపారు.