సెల్‌ఫోన్ కోసం రైలు నుంచి దూకాడు...

ముంబై: సెల్‌ఫోన్ కోసం రైలు నుంచి దూకి ఓ డాక్టర్ ప్రాణాలు కోల్పోయిన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. తన మొబైల్‌ను ఓ వ్యక్తి దొంగిలించడంతో దాని కోసం రైలునుంచి కిందకు దూకి తీవ్రంగా గాయపడి చికిత్సపొందుతూ మృతిచెందారు. ఈ ఘటన ముంబై సెంట్రల్ రైల్వే పరిధిలోని కల్వా రైల్వేస్టేషన్ వద్ద చోటుచేసుకున్నది. నాసిక్‌కు చెందిన చేతన్ అహిర్‌రావు(35) వైద్యాధికారిగా పనిచేస్తున్నారు. థానే సమీపంలోని దివా స్టేషన్‌కు వెళ్తూ రైల్వే ఫుట్‌బోర్డుపై నిలబడి ఉన్నారు. ఈ క్రమంలో రైలు కల్వా స్టేషన్‌కు రాగానే అహిర్‌రావు చేతిలోని సెల్‌ఫోన్‌ను ప్లాట్‌ఫామ్ మీద ఉన్న ఓ వ్యక్తి లాక్కొన్నాడు. దీంతో అహిర్‌రావు మొబైల్‌ఫోన్ కోసం రైలు నుంచి దూకడంతో రైల్వే పట్టాల సమీపంలో పడిపోయారు. తీవ్రగాయాలపాలైన అతడిని రైల్వే సిబ్బంది గమనించి సమీప దవాఖానకు తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందారు. కాగా కేసు దర్యాప్తుచేసిన పోలీసులు అహిర్‌రావు మొబైల్ కనిపించకపోవడంతో ఆ దిశగా విచారణ జరుపగా.. మొబైల్ కోసమే ఆయన రైలు నుంచి దూకాడన్న విషయం వెలుగులోకి వచ్చింది. అజయ్ సోలంకి(19) అనే వ్యక్తి అహిర్‌రావు మొబైల్ లాక్కోవడంతో అతడు రైలు నుంచి దూకాడన్న విషయం సీసీ కెమెరాల్లో బయటపడింది. దీంతో పోలీసులు అజయ్ సోలంకిని అరెస్ట్‌చేసి వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ 3 వరకు అతడికి కోర్టు రిమాండ్ విధించింది.
× RELATED సీఎం సభాస్థలిని పరిశీలించిన జీవన్‌రెడ్డి, కేఆర్ సురేశ్‌రెడ్డి