34 లక్షల టన్నుల ధాన్యం సేకరిస్తాం

-గతేడాదితో పోల్చితే రెండింతలు పెరిగిన వానకాలం లక్ష్యం -కేసులున్న మిల్లులకు ధాన్యం సరఫరా చేయొద్దు -వానకాలం ధాన్యం సేకరణపై జేసీలతో సమీక్షలో మంత్రి ఈటల హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఈ వానకాలం 34 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని నిర్ణయించినట్టు పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. గడిచిన నాలుగేండ్లలో ధాన్యం కొనుగోలు, చెల్లింపు, కనీస మద్దతు ధర అమలు, సీఎమ్మార్ రాబట్టడంలో రాష్ట్ర పౌరసరఫరాలశాఖ దేశంలోనే చరిత్ర సృష్టించిందని ప్రశంసించారు. తెలంగాణ పౌరసరఫరాలశాఖ పనితీరుపై అనేక రాష్ట్రాలు ప్రశంసలు కురిపించాయని, పలు రాష్ట్రాల అధికారులు పర్యటించి అధ్యయనం కూడా చేశారని చెప్పారు. వానకాలం ధాన్యం సేకరణపై అన్ని జిల్లాల జేసీలతో కమిషనర్ అకున్ సబర్వాల్‌తో కలిసి మంత్రి ఈటల శనివారం హైదరాబాద్‌లో సమీక్ష నిర్వహించారు. 34 లక్షల టన్నుల వానకాలం ధాన్యం సేకరించాలని నిర్ణయించామని, ఇది గతేడాదితో పోల్చితే రెండింతలని అన్నారు. మొత్తం 57 లక్షల టన్నుల పంట దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల వల్ల సాగు విస్తీర్ణం పెరిగి దిగుబడి అధికంగా ఉంటుందని, దీని వల్ల రాబోయే రోజుల్లో 70 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వాలు ధాన్యం సేకరణలో రైతుకు నమ్మకం కలిగించలేకపోయాయని, కానీ తెలంగాణ ప్రభుత్వం అందుకు భిన్నంగా ప్రతి గింజకు మద్దతు ధర కల్పించి రైతుల్లో ధైర్యం నింపిందని స్పష్టంచేశారు. ఇందుకు అధికారులు, సిబ్బంది ఎంతో కృషి చేశారని, దీన్ని ఇలాగే కొనసాగించాలని సూచించారు. 34 లక్షల టన్నుల ధాన్యం సేకరించడానికి 1,128 ఐకేపీ సెం టర్లు, 1,799 ప్రాథమిక వ్యవస్థ సహకార సంఘాల కేంద్రాలు, 213 ఇతర కేంద్రాలు.. మొత్తంగా 3,140 ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. అవసరమైతే సెంటర్ల సంఖ్యపెంచాలని, ఎట్టి పరిస్థితుల్లో ధాన్యం కొనడం ఆలస్యం కావొద్దని జేసీలకు సూచించారు.

కొనుగోలు కేంద్రాల వద్ద వసతులుండాలి

కొనుగోలు కేంద్రాల వద్ద తాగునీరు, టాయ్‌లెట్స్ వంటి వసతులు ఉండాలని ఈటల ఆదేశించారు. ధాన్యం సేకరణకు 8.59 కోట్ల గన్నీ బస్తాలు అవసరమని, పాత బస్తాల నాణ్యత విషయంలో కఠినంగా వ్యవహరించాలన్నారు. కేసులున్న రైస్ మిల్ల్లులకు ధాన్యం సరఫరా చేయవద్దని ఆదేశించారు. మిల్లుల సామర్థ్యాన్ని బట్టి ధాన్యం కేటాయించాలని, పంపిన ధాన్యం వెంటనే దిగుమతి చేసుకునేలా చూడాలని కోరారు. గతేడాది 100 శాతం సీఎమ్మార్ సేకరించినందుకు అధికారులను ప్రశంసించారు. ఇదే ఒరవడి కొనసాగించాలని సూచించారు. కేంద్ర నిబంధనల ప్రకారం, వరికి మద్దతు ధర గ్రేడ్ ఏకు రూ.1,770, కామన్ వెరైటీకి రూ.1,750 చెల్లిస్తామని తెలిపారు. రైతులు ఎవరూ తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోకూడదని కోరారు. పెండింగ్‌లో ఉన్న రేషన్ కార్డులన్నింటినీ ఇస్తామని, రేషన్ బియ్యం తినని కార్డుదారులు అనవసరంగా తీసుకొని వ్యాపారులకు అమ్ముకోవద్దని సూచించారు. రేషన్ తీసుకోకపోయినా కార్డులు ఎట్టి పరిస్థితిలో తొలిగించబోమని స్పష్టంచేశారు.