రెరాకు రాష్ట్రవ్యాప్త ఆదరణ

- తొలివారంలోనే 300 రిజిస్ట్రేషన్లు హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న రెరాకు (రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ) రాష్ట్రవ్యాప్తంగా ఆదరణ లభిస్తున్నది. హైదరాబాద్‌లో రెరా కార్యాలయాన్ని ప్రారంభించిన తొలివారంలోనే 300 రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. ఇందులో రెండొందల నిర్మాణాలు.. వంద ఏజెంట్లు ఉన్నాయి. రెరాలో నమోదు చేసుకోవడానికి హైదరాబాద్‌తోపాటు వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్ వంటి ఇతర నగరాల్లో అపార్టుమెంట్లు, విల్లాలను ఆరంభించిన బిల్డర్లు, డెవలపర్లు కూడా ముందుకొస్తున్నారు. రెరాలో నమోదు చేసుకుంటే.. ధైర్యంగా ఇండ్లను అమ్ముకోవచ్చని, ఎవరో తమ మీద ఫిర్యాదు చేస్తారేమోనని భయపడనక్కరలేదని ఓ డెవలపర్ అభిప్రాయపడ్డారు. కొంతమంది రియల్‌ఎస్టేట్ ఏజెంట్లు మెట్రో నగరాల్లో రియల్ లావాదేవీలను నిర్వహిస్తుంటారు. ఇలాంటివారంతా తెలంగాణ రెరాలో రిజిస్టర్ అవుతున్నారు.