గచ్చిబౌలిలో బస్సు బీభత్సం

-ముగ్గురి మృతి.. ఒకరికి స్వల్పగాయాలు -అతివేగమే ప్రమదానికి కారణమన్న పోలీసులు
శేరిలింగంపల్లి: హైదరాబాద్ గచ్చిబౌలిలో ఆర్టీసీ బస్సు సోమవారం బీభత్సం సృష్టించింది. బస్టాపులో నిల్చున్న నలుగురిని ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరొకరికి స్వల్పగాయాలయ్యాయి. పోలీసుల, స్థానికుల కథనం ప్రకారం.. బెంగళూరుకు చెందిన జనార్దన్ శివాజీ (33) గచ్చిబౌలిలోని ఇందిరానగర్‌లో ఉంటూ నానక్‌రాంగూడ ఐటీ కారిడార్‌లోని క్యాప్‌జెమినీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. సోమవారం ఉదయం 6:30 గంటలకు జనార్దన్ తోటిఉద్యోగి ప్రతాప్‌సింగ్‌తో కలిసి బెంగళూరు నుంచి వచ్చారు. ఔటర్ రింగ్‌రోడ్ సమీపంలోని గచ్చిబౌలి జంక్షన్ బస్టాపులో ఇందిరానగర్‌కు వెళ్లేందుకు ఆటోకోసం వేచిఉన్నారు. సమీపంలో ఉన్న ఆటోడ్రైవర్లు నానక్‌రాంగూడకు చెందిన బత్తుల దశరథ్(45), పాతబస్తీకి చెందిన అబ్దుల్ హమీద్ (50) ఆటోకావాలా సార్ అంటూ వీరి వద్దకు వచ్చారు.

వారు మాట్లాడుతుండగానే హెచ్‌సీయూ డిపోకు చెందిన లింగంపల్లి నుంచి కోఠికి వెళ్తున్న బస్సు వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జనార్దన్ శివాజీ, బత్తుల దశరథ్, అబ్దుల్ హమీద్ అక్కడికక్కడే మృతిచెందారు. ప్రతాప్‌సింగ్‌కు స్వల్పగాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ జహంగీర్, కండక్టర్ ప్రవీణ్‌కుమార్‌తోపాటు స్థానికులు మృతదేహాలను బస్సు కిందనుంచి బయటకు తీశారు. బాధితుడు ప్రతాప్‌సింగ్ ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా, అతివేగంగా బస్సు నడుపడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.