హార్దిక్ పటేల్‌పై 2,700 పేజీల ఛార్జీషీట్ నమోదు

అహ్మదాబాద్: పాటీదార్ అనామత్ ఆందోళన్ సమితి కన్వీనర్ హార్దిక్ పటేల్‌తో పాటుగా అతని ముగ్గురు అనుచరులపై గుజరాత్ క్రైం బ్రాంచ్ పోలీసులు తాజాగా 2,700 పేజీల చార్జీషీట్‌ను నమోదు చేశారు. హార్దిక్‌కు అతని మద్దతుదారులకు మధ్య నడిచిన 42 ఫోన్‌కాల్స్ రికార్డు, 503 మంది సాక్షులు, ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ నివేధికలను పోలీసులు ఛార్జీషీట్‌లో పొందుపరిచారు. గుజరాత్ పోలీసులు హార్దిక్ పటేల్‌పై గతంలో రాజద్రోహం కేసులో 370 పేజీల ఛార్జీషీట్‌ను ఫైల్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులు ఆల్ఫేష్ కతారియా, అమ్రిష్ పటేల్ ఇంకా పరారీలోనే ఉన్నారు. హార్దిక్‌తో పాటుగా మరో 14 మంది పటేల్ నాయకులు గడిచిన ఏడాది అక్టోబర్ 18వ తేదీ నుంచి కస్టడీలో ఉన్నారు. పటేల్ వర్గంపై పెడుతున్న ఈ కేసులపై సర్దార్ పటేల్ గ్రూప్ నాయకులు లాల్జీబాయ్ పటేల్ స్పందిస్తూ.. సమస్యను ప్రభుత్వం పక్కదారిపట్టిస్తుంది. ఆందోళనకారులపై కేసులను ఉపసంహరిస్తామని ఒక్కప్రక్క చెబుతూనే మరోప్రక్క అతిపెద్ద ఛార్జీషీట్‌లతో కూడిన కేసులను నమోదు చేస్తుంది. పటేల్ రిజర్వేషన్లపై ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానాన్ని వెల్లడించాలి. ఆందోళనకారులపై పెట్టిన అన్ని కేసులను ఉపసంహరించుకోవాలి. జైళ్లలో ఉన్న వారిని వెంటనే విడుదల చేయాలి. తమ డిమాండ్లు నెరవేరేంత వరకు ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ బహిష్కరిస్తమని హెచ్చరించారు. సమస్య ఇలాగే కొనసాగుతూపోతే 2017లో జరిగే శాసనసభ ఎన్నికల్లో తమ ప్రతాపం చూపిస్తామని ఆయన హెచ్చరించారు.
× RELATED సీఎం కేసీఆర్ పాలనలో అన్ని రంగాల్లో ముస్లింల అభివృద్ధి