24ముద్దుల కథ

అరుణ్‌అదిత్, హెభాపటేల్ జంటగా నటించిన చిత్రం 24కిస్సెస్. నీకో సగం..నాకో సగం..ఈ ఉత్సవం ఉపశీర్షిక. అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి దర్శకుడు. ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక శనివారం హైదరాబాద్‌లో జరిగింది. మంచు లక్ష్మి ఆడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ సినిమా విజువల్స్ చాలా బాగున్నాయి. దర్శకుడు అయోధ్యకుమార్ గతంలో అనేక అవార్డులను సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాతో మరింత గుర్తింపును తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను అన్నారు. వినూత్న ఇతివృత్తంతో రూపొందించిన చిత్రమిది. నేటి యువతరం మెచ్చే అంశాలుంటాయి. విడుదలైన తర్వాత ఈ సినిమా గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు అని దర్శకుడు తెలిపారు. హెబ్బా పటేల్ మాట్లాడుతూ నా కెరీర్‌లో ఎంతో ప్రత్యేకమైన చిత్రమిది. నా పాత్ర చిత్రణ విభిన్న కోణంలో సాగుతుంది.

అభినయానికి ఆస్కారమున్న మంచి పాత్రను చేయడం ఆనందంగా ఉంది అని చెప్పింది. ఇన్నోవేటివ్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రాన్ని అందరూ ఆదరించాలని హీరో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రసిద్ధార్థ్, నరేష్, నవీన్‌చంద్ర, నవదీప్, సందీప్‌కిషన్, ప్రవీణ్ సత్తారు తదితరులు పాల్గొన్నారు.