24 యేండ్లకే ఎంపీ!

పాకిస్థాన్‌లో ఇటీవల హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన 24 యేండ్ల యువతి ఎంపీగా గెలిచి పార్లమెంట్‌లోకి అడుగు పెట్టబోతున్నది.

పాకిస్థాన్ తెహ్రీక్ ఈ ఇన్సాన్ పార్టీకి చెందిన జరతజ్ గుల్ ఈ ఘనత సాధించారు. ఈమె దక్షిణ పంజాబ్ నుంచి పోటీ చేశారు. పాకిస్థాన్ ముస్లిం లీగ్‌కు చెందిన సర్దార్ ఓవైసీని ఆమె ఓడించి ఎంపీగా గెలుపొందారు. తన గెలుపు అనంతరం పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్‌ఖాన్‌కు గుల్ ధన్యవాదాలు తెలిపారు. జరత్ గుల్ 1994 నవంబర్‌లో ఫట్వా ప్రావిన్స్‌లో జన్మించారు. ఆమె తండ్రి వాజీర్ అహ్మద్ ఓ ప్రభుత్వ అధికారి. పీపీపీ పార్టీలో క్రియాశీల సభ్యురాలిగా ఉంటూ.. మహిళా ఓటర్లను తనవైపు తిప్పుకోవడంలో చాలా కీలకంగా వ్యవహరించారు గుల్. అంతేకాకుండా ఈసారి పాకిస్థాన్‌లో జరిగిన ఎన్నికల్లో అత్యంత అందమైన మహిళ పోటీలో ఉందంటూ స్థానిక మీడియా, సోషల్ మీడియా గుల్ అందాన్ని కీర్తిస్తూ, ఆమె చేస్తున్న పనులను గురించిన కథనాలు ప్రచురించాయి. పాకిస్థాన్‌లో మహిళల చదువు కోసం ఎంతో కృషి చేశారు గుల్. మహిళలు, చిన్న పిల్లల హక్కులపై పోరాటం చేశారు. ప్రజలతో నిత్యం ఉంటూ.. పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు కాబట్టే.. ఎంపీగా గెలుపొందారని స్థానికులు చెబుతున్నారు.