ఎడ్జ్ బ్రౌజర్‌కు ముగింపు పలకనున్న మైక్రోసాఫ్ట్

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ ఎట్టకేలకు తన ఎడ్జ్ ఇంటర్నెట్ బ్రౌజర్ ముగింపు వార్తల పట్ల స్పందించింది. ఆ బ్రౌజర్ సేవలను నిలిపివేయనున్నట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఎడ్జ్ బ్రౌజర్‌కు ముగింపు పలికి దాని స్థానంలో త్వరలో మరో కొత్త ఇంటర్నెట్ బ్రౌజర్‌ను ప్రవేశపెడతామని మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు చెబుతున్నారు.

గూగుల్ క్రోమ్, ఓపెరా, ఫైర్‌ఫాక్స్ ఇంటర్నెట్ బ్రౌజర్లనే చాలా మంది ప్రస్తుతం వాడుతున్నారు. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఎడ్జ్ వాడకం తక్కువనే చెప్పాలి. ఎన్ని ఫీచర్లను అందించినా బ్రౌజర్‌కు ఉన్న పలు కంపాటబిలిటీ సమస్యలతో యూజర్లు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీంతో తమ బ్రౌజర్‌కు వస్తున్న నిరాదరణను దృష్టిలో ఉంచుకుని ఇకపై ఆ బ్రౌజర్‌కు ముగింపు పలకాలని మైక్రోసాఫ్ట్ నిర్ణయించుకుంది. అందుకనే గత కొంత కాలంగా ఎడ్జ్ బ్రౌజర్ నిలిచిపోతుందనే వార్తలు వస్తుండగా ఇప్పుడవే నిజమయ్యాయి. దీంతో ఎడ్జ్ బ్రౌజర్ ఇక యూజర్లకు అందుబాటులో ఉండదు.

అయితే ఎడ్జ్ ఇంటర్నెట్ బ్రౌజర్‌కు బదులుగా క్రోమ్ ఓఎస్ ఆధారిత ఓపెన్ సోర్స్ ఇంటర్నెట్ బ్రౌజర్‌ను త్వరలో అందుబాటులోకి తెస్తామని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. కానీ అది ఎప్పుడు వస్తుందో ఆ సంస్థ కచ్చితంగా చెప్పలేదు. ప్రస్తుతం ఆ కొత్త బ్రౌజర్‌ను మైక్రోసాఫ్ట్ అంతర్గతంగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. అందువల్ల త్వరలోనే ఆ బ్రౌజర్‌ను లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం..!